అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు భారీగా పెంచడం తో మన ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పెరిగింది. సెప్టెంబర్ నెలలో ఇలా ఎఫ్‌ఐఐలు 20 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ప్రధానంగా ఆరు రంగాల్లో ఈ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, ఆయిల్, గ్యాస్, మెటల్స్, ఫైనాన్షియల్ సెక్టర్, రియాల్టి, పవర్ రంగాల్లో ఎఫ్‌ఐఐలు ఎక్కువ అమ్మకాలు జరిపారు. ఒక్క ఐటీ సెక్టర్ నుంచే 9,200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఎఫ్‌ఐఐలు జరిపిన అమ్మకాల ప్రభావం మార్కెట్లెపై పడింది. సెప్టెంబర్‌లో సెన్సెక్స్ 3.5 శాతం తగ్గింది. ఎక్కువ అమ్మకాలు జరిగిన ఐటీ సెక్టర్ సూచీ 5 శాతం పతనమైంది.
బొంబే స్టాక్ ఎక్సైంజ్‌లో పవర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టి రంగాల సూచీలు 6నుంచి 9 శాతం తగ్గాయి. మార్కెట్ డేటా ప్రకారం ఎఫ్‌ఐఐలు ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 4,410 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మెటల్స్‌లో 2,995 కోట్లు, ఫైనాన్షియల్ సెక్టర్‌లో 1673 కోట్లు, రియాల్టిd రంగంలో 1292 కోట్లు, పవర్ సెక్టర్ 1069 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఆగస్టులో ఎఫ్‌ఐఐలు 12,799 కోట్ల రూపాయలు ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అదే సందర్భంలో ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లపై ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు పెట్టారు.