Saturday, November 23, 2024

అమ్మకాల్లో పండగ జోష్‌.. 2.60 లక్షల కోట్ల వ్యాపారం టార్గెట్‌

ఈ సారి పండగ జోష్‌ ఎక్కువగానే ఉంది. కొవిడ్‌ తరువాత పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో అన్ని సంస్థలు, కంపెనీలు పండగ అమ్మకాలపై గురిపెట్టాయి. ఈ సీజన్‌లో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం కనీసం 10 వేల వరకు ఖర్చు చేయవచ్చని లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. స్టోర్స్‌కు వచ్చే వారి సంఖ్య సైతం 20 శాతం పెరిగిందని సర్వేలో తేలిందని లోకల్‌ సర్కిల్స్‌ నివేదిక పేర్కొంది. ఈ సారి పండగల సీజన్‌లో అమ్మకాలు 2.60 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
సాధారణంగా పండగల సీజన్‌లో కొత్త వస్తువులు కొనడం శుభమని భావిస్తుంటారు. దీంతో పాటు ఈ సారి వ్యాపారులు, ఇ-కామర్స్‌ సైట్స్‌, సంస్థలు, కంపెనీలు, చివరకు బ్యాంక్‌లు, వాహన అమ్మకందారులు ఇలా ప్రతి ఒక్కరు భారీగా ఆఫర్లు పెట్టి వినియోగదారులకు ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోటీలు పడి ఆఫర్ల వర్షం కురిస్తున్నారు. లోకల్‌ సర్కిల్స్‌ దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో చేసిన సర్వేలో 58 వేల మంది పాల్గొన్నారు.

సర్వేలో అంశాలు..

సర్వేలో పాల్గొన్న వారిలో 35 శాతం మంది పండగ సీజన్‌లో కొనుగోళ్లు చేయబోమని చెప్పారు. ధరలు ఎక్కువగా ఉండటం, ఉపాధి కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు. పండగ అమ్మకాల్లో పాల్గొంటామని చెప్పిన వారిలో 3 శాతం మంది లక్షలకు పైగా కొనుగోలు చేస్తామన్నారు. 9 శాతం మంది 50 వేల నుంచి లక్ష వరకు, 15 శాతం మంది 20 వేల నుంచి 50 వేల వరకు, 6 శాతం మంది 10 వేల నుంచి 20 వేల వరకు, 17 శాతం మంది 5 వేల నుంచి 10 వేల వరకు , 9 శాం మంది 2 వేల వరకు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ధరకు తగ్గ విలువ ఉండే వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తామని 31 శాతం మంది చెప్పారు. 16 శాతం మంది తమ అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తామన్నారు. 49 శాతం మంది షాపింగ్‌ మాల్స్‌, దుకణాలకు వెళ్లి కొంటామని చెప్పగా, 38 శాతం మంది ఇ-కామర్స్‌ ద్వారా కొంటామని తెలిపారు. 10 శాతం మంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

గత సంవత్సరం పండగ సీజన్‌లో 39 శాతం మంది ఇ-కామర్స్‌ సైట్స్‌ నుంచి షాపింగ్‌ చేశారు. 35 శాతం మంది దీపావళికి దీపాలు, కొవ్వొత్తులు, లైటింగ్‌ పరికరాలు, పూలు ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తామని చెప్పారు. 26 శాతం మంది పండగ సీజన్‌లో ప్రత్యేక గిఫ్ట్‌ ప్యాక్‌లు, డ్రై ఫ్రూట్స్‌ చాక్లెట్లు, తాజా పండ్లు, స్వీట్లు కొంటామని తెలిపారు. 12 శాతం మంది దుస్తులు, కాస్మోటిక్స్‌, చెప్పులు, బ్యాగులు ఇతర ఫ్యాషన్‌ వస్తువులు కొంటాని వెల్లడించారు. 12 శాతం మంది ఫర్నీచర్‌, అలంకరణ, రంగులు, శానిటరీవేర్‌, వంట గృహ సంబంధ వస్తువులు కొంటామన్నారు. చాలా తక్కువగా కేవలం 6 శాతం మంది మాత్రం రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు కొంటామని తెలిపారు.

- Advertisement -

28 శాతం పెరిగిన ఇ-కామర్స్‌ ఆర్డర్లు..

పండగ సీజన్‌ ప్రారంభమైన రెండు రోజుల్ల ఇ-కామర్స్‌ సైట్స్‌ఉ గత సంవత్సరంతో పోల్చితే 28 శాతం ఆర్డర్లు పెరిగాయని సాఫ్ట్‌వేర్‌ యూజ్‌ ఏ సర్వీస్‌ ప్లాట్‌ఫామ్‌ యూనికార్స్‌ తెలిపింది. ఇ-కామర్స్‌ సంస్థలతో పాటు, వాటిల్లో ఉత్పత్తులు విక్రయించే 15 వేల మంది వ్యాపారులు, 7 వేల గోదాములు, 15 వందల షాపులకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఈ నెల 23, 24 తేదీల్లో ఇ-కామర్స్‌ సంస్థలకు 70 లక్షల ఉత్పత్తులకు ఆర్డర్‌ రాగా, ప్రాసెస్‌ జరుగుతున్నట్లు తెలిపింది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో70 శాతం , ఎలక్ట్రానిక్స్‌లో 48 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తుల్లో 7 శాతం వృద్ధి కనిపించింది. హోం డెకరేషన్‌, గిఫ్టింగ్‌ ఐటమ్స్‌కు కూడా డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. ఫర్నీచర్‌, ఆభరణాల అమ్మకాల్లోనూ వృద్ధి ఉంది.

రెండు, మూడో స్థాయి నగరాల్లో 20 శాతం, 30 శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ అమ్మకాల్లో 75 శాతం ఆర్డర్లు, రెండు, మూడో స్థాయి నగరాల నుంచే వచ్చినట్లు అమెజాన్‌ తెలిపింది. పండగ అమ్మకాల తొలిరోజే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ల ద్వారా వెయ్యి కోట్ల విలువైన 12 లక్షలకు పౖౖెగా గెలాక్సీ స్మార్ట్‌ ఫోన్లను విక్రయించినట్లు శామ్‌సంగ్‌ ఇండియా ప్రకటించింది. ఫోన్ల ధరలను 17 నుంచి 60 శాతం తగ్గించినట్లు తెలిపింది. అమెజాన్‌లో విక్రయించిన ప్రతి మూడు ఫోన్లలో ఒకటి శామ్‌సంగ్‌దే నని ఆ కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement