ఈ ఆర్థిక సంవత్సరం ఎరువుల రాయితీ కోసం కేటాయించిన బడ్జెట్ మరో 40 వేల కోట్లు పెరిగింది. బడ్జెట్లో ఇందు కోసం ప్రభుత్వం 2.15 లక్షల కోట్లు కేటాయించింది. ఇప్పుడు ఇది మరో 40 వేల కోట్లు పెరిగి, 2.55 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక పేర్కొంది. సహజ వాయువు ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. యూరియా తయారీలో ప్రధాన ముడి పదార్ధంగా సహజ వాయువును ఉపయోగిస్తారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ రష్యా వివాదంతో గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. దీన్ని అనుసరించి మన ప్రభుత్వం కూడా ఏప్రిల్ 1నుంచి దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరల్ని 150 శాతం పెంచింది.
పరిశ్రమల సబ్సిడీకి బడ్జెట్లో 1.05 లక్షల కోట్లు కెటాయించగా, గత సంవత్సరం మే నెలలో 1.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. యూరియా ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మార్కెట్ ధర కంటే 85 శాతం లోపే యూరియా ధర ఉండేలా చూస్తుంది. రైతుల కోసం ప్రభుత్వం తక్కువ ధరకే యూరియాను సరఫరా చేస్తోంది. ఉత్పత్తి దారులు నష్టపోకుండా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం వారికి రాయితీని చెల్లిస్తుంది. గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వంపై 40 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది.