Saturday, November 23, 2024

రికార్డు స్థాయిలో ఫాస్టాగ్‌ వసూళ్లు.. నాలుగు వేల కోట్ల ఆదాయం..

ఫాస్టాగ్‌ కలెక్షన్లు అదరగొట్టాయి. రికార్డుస్థాయిలో వసూళ్ల వర్షం కురిసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన వసూళ్లు కొత్తరికార్డును నెలకొల్పాయి. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు పెరగడం, ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడం వంటి చర్యలు దీనికి కారణాలు అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో ఫాస్టాగ్‌ ద్వారా వచ్చిన ఆదాయం 4,095 కోట్ల రూపాయలు. ఈస్థాయి కలెక్షన్లు ఇదివరకెప్పుడు నమోదు కాలేదు. 2016లో డిజిటల్‌ కలెక్షన్ల వ్యవస్థను జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. అప్పటినుంచి తొలిసారిగా వసూళ్లు 4,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 38,084 కోట్ల రూపాయలు ఫాస్టాగ్‌ ద్వారా వసూలయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే 68శాతం పెరుగుదల కనిపించింది. కిందటి సంవత్సరం మార్చినెలలో నమోదైన వసూళ్లపరంగా చూసినా తాజాగా సాధించిన వసూళ్లు 33శాతం అధికం.

గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద నమోదైన 38,084 కోట్ల రూపాయల్లో చివరి త్రైమాసికం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చిన కలెక్షన్ల వాటా అధికం. ఫిబ్రవరిలో 13శాతం కలెక్షన్ల పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23ఆరంభం నుంచే కేంద్ర ప్రభుత్వం టోల్‌ప్లాజాల వద్ద వాహనదారులు చెల్లించాల్సిన ఛార్జీల మొత్తాన్ని భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ అదనపు భారాన్ని తెలంగాణ ఆర్జీసీ యాజమాన్యం ప్రయాణికులపై ఇప్పటికే మోపింది. ఒక్కో వాహనం మీద సగటున 30 నుంచి 50 రూపాయల మేర అదనంగా టోల్‌ ప్లాజా ఛార్జీల అదనపు భారం పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement