Friday, November 22, 2024

వేగంగా వీసాలు ! భారత్‌కు ప్రాధాన్యం పెంచుతామన్న అమెరికా

భారతీయులకు వీసాలు జారీచేసే ప్రక్రియను అమెరికా మరింత వేగవంతం చేయనుంది. ప్రాధాన్యత కేటగిరీలో ఎక్కువ వీసాలు, తక్కువ ప్రాసెసింగ్‌ సమయం వంటి అంశాలపై అగ్రరాజ్యం దృష్టిసారించింది. ప్రస్తుతం యూఎస్‌ ఎంబసీ వద్ద 12 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2023 వేసవి నాటికి వీసా దరఖాస్తు దారు నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గనుంది. కొవిడ్‌ పూర్వపు స్థితికి వీసా జారీ ప్రక్రియ చేరుతుంది అని యూఎస్‌ దౌత్య కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు గురువారం స్పష్టంచేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా సుమారు లక్ష వీసాలు జారీ అవుతాయని అంచనా. గత ఏడాది కాలంలో 82,000 వీసాలు మంజూరు చేసింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రయాణ పరిమితులను రద్దు చేసిన తర్వాత యూఎస్‌ వీసా దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి అని సదరు అధికారి తెలిపారు. వీసా ప్రక్రియ సమయం తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అదనపు సిబ్బంది నియామకం, డ్రాప్‌బాక్స్‌ సొకల్యాల విస్తరణ వంటి అనేక ప్రయత్నాలు ప్రారంభిస్తామని అన్నారు. కొన్ని వర్గాలకు, నిరీక్షణ సమయం ఇప్పటికే 450 రోజుల నుండి దాదాపు తొమ్మిది నెలలకు తగ్గింది.

భారత్‌ రెండవ స్థానం

అమెరికా ఇచ్చే వీసాల సంఖ్య పరంగా చూస్తే భారత్‌ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశం మెక్సికో, చైనా తర్వాత మూడవ స్థానంలో ఉంది. ముఖ్యంగా వీసా పునరుద్ధరణ కోరుకునే వారి కోసం విద్యార్థి వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. భారతీయుల కోసం హెచ్‌ (హెచ్‌1బి), ఎల్‌ కేటగిరీ వీసాలు గతంలో అమెరికా ప్రాధాన్యతగా ఉన్నాయి. ఇటీవల ఈ కేటగిరీల వారికి సుమారు 10 లక్షల స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా, బి1, బి2 (బిజినెస్‌, టూరిస్ట్‌) వీసాల కోసం నిరీక్షణ సమయం సుమారు తొమ్మిది నెలలకు తగ్గించబడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement