జీఎస్టీ పరిహారం సెస్‌ను 2026, మార్చి 31 వరకు పొడిగించారు. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 30తో ఈ గడువు ముగియనుంది. రాష్ట్రాలకు చెల్లించేందుకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న రుణాల చెల్లింపు పూర్తి అయ్యే వరకు ఈ సెస్‌ను వసూలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
జీఎస్టీ వల్ల రాష్ట్రాలు కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం చెల్లించే గడువు మాత్రం పెంచలేదు. జీఎస్టీ ప్రారంభమైన సమయంలో రాష్ట్రాలు అమ్మకం పన్ను, వ్యాట్ వల్ల కోల్పోతున్నందున, నష్టపోతున్న ఆదాయాన్ని ఐదు సంత్సరాల పాటు చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ గడువు 2022, జూన్ 30తో ముగుస్తుంది.
ఈ గడువు పెంచబోమన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే స్పష్టం చేశారు. కోవిడ్ మూలంగా జీఎస్టీ ఆదాయం అనుకున్న మేరకు రాకపోవడంతో కేంద్రం రాష్ట్రాలకు చెల్లించేందుకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్షా 10 వేల కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్షా 59 వేల కోట్లు రుణాలు తీసుకుంది. ఈ రుణాలపై గత ఆర్థిక సంవత్సరంలో 7,500 కోట్లు వడ్డీని చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 14 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అసలు చెల్లించడం ప్రారంభమై, 2026 వరకు పూర్తి అవుతుంది.
అందుకే జీఎస్టీ పరిహారం సెస్ వసూలును 2026 మార్చి 31 వరకు నాలుగు సంవత్సరాల పాటు పొడిగించారు. ఈ సెస్ విలాసవంతమైన వస్తువులపైనా, పొగాకు, సిగరేట్లు, హుక్కా, ఏరేటెడ్ వాటర్స్, ప్రీమియం మోటార్ సైకిళ్లు, విమానాల వంటి వాటిపై వసూలు చేస్తారు. సెస్ వల్ల వీటి ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. జీఎస్టీ సెస్ కొనసాగించడం వల్ల మోటార్ పరిశ్రమపై ఎక్కువ ప్రభావం పడుతుందని సంబంధిత పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.