Friday, November 22, 2024

నిలిచిన పామాయిల్‌ ఎగుమతి.. స్నాక్స్​ కంపెనీలపై తీవ్ర ప్రభావం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం బ్రిటానియా కంపెనీని కూడా తాకింది. ఇండోనేషియా తమ దేశం నుంచి పామాయిల్‌ ఎగుమతులను నిలిపివేయడంతో ఆ ప్రభావం స్నాక్స్‌ తయారీ కంపెనీలపై పడింది. దిగ్గజ బిస్కెట్‌ తయారీ సంస్థ బ్రిటానియా కూడా తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. బ్రిటానియా ఉత్పత్తుల ధరలు 10 శాతం వరకు పెరగనున్నట్టు కంపెనీ వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలోనే బ్రిటానియా ధరలను 10 శాతం వరకు పెంచింది. ద్రవ్యోల్బణం ఊహించని స్థాయిలో పెరగడంపై కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ మూలంగా కీలక ముడి పదార్థాల రేట్లు పెరగడంతో పెంపు తప్పడం లేదని కంపెనీ వెల్లడించింది.

గోధుమల ధరలకు రెక్కలు
బిస్కెట్ల తయారీలో కీలకమైన గోధుమలు, వెజిటబుల్‌ ఆయిల్‌, చక్కెర ధరలు ఇటీవల భారీగా పెరిగాయని బ్రిటానియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ బెర్రి తెలిపారు. వీటికితోడు పెరుగుతున్న గ్యాస్‌ ధరలు, కరెంట్‌ రేట్లు, లేబర్‌ ఛార్జీలు, రవాణా ఖర్చులు, ఇతర బేకింగ్‌ ముడి పదార్థాల ధరల కారణంగా తన ప్రొడక్టుల ధరలను మరింత పెంచుతున్నట్టు బ్రిటానియా కంపెనీ ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఇప్పటికే గోధుమల ధరలు పెరిగాయని వివరించారు. ప్రస్తుతం పామాయిల్‌ ఎగుమతులను ఇండోనేషియా నిషేధించడంతో వంట నూనెలు కూడా ఖరీదైనట్టు వివరించారు.

మున్ముందు మరింత పెంపు
ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఉత్పత్తుల ధరలను 10 శాతం పెంచనున్నట్టు బ్రిటానియా కంపెనీ తెలిపింది. ప్రస్తుతం చాలా కష్టకాలం కొనసాగుతున్నదని కంపెనీ అభిప్రాయపడింది. ప్రతి నెలా తాము పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. కన్జ్యూమర్‌లపై ఎక్కువ భారాన్ని తాము మోపాలనుకోవడం లేదని, కానీ మేజర్‌ కమోడిటీల రేట్లు పెరుగుదల కొనసాగితే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని బెర్రి తేల్చి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గోధుమల ధరలు పెరుగుదల ప్రభావం భారత్‌పైనా పడుతున్నది. భారత్‌లో పండే గోధుమలకు యుద్ధం కారణంగా డిమాండ్‌ పెరిగింది. వివిధ కారణాలతో దేశంలో గోధుమల ఉత్పత్తి తగ్గడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది.


————-


టాటా మోటార్స్‌..
ఏస్‌ ఈవీ మినీ ట్రక్‌
ఫుల్‌ ఛార్జింగ్‌తో 154 కి.మీ
లాజిస్టిక్‌ సేవలకు ఎంతో కీలకం
ఈ-కామర్స్‌ కంపెనీలతో ఒప్పందం
టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌
న్యూఢిల్లిd : దేశీయ వాహన రంగ దిగ్గజం టాటా మోటార్స్‌.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో ఏస్‌ మినీ ట్రక్‌ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడారు. వాహన రంగంలో ఈవీ సెగ్మెంట్‌ను విస్తరించుకుంటూ వెళ్తున్నట్టు వివరించారు. ఈ-కామర్స్‌ కంపెనీలు అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌, సిటీ లింక్‌, డాట్‌, ఫ్లిప్‌కార్ట్‌, లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. 17 ఏళ్ల తరువాత.. ఏస్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ను లాంచ్‌ చేసినట్టు వివరించారు. ఆయా ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీల నుంచి 39వేల ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఆర్డర్లు పొదినట్టు ప్రకటించారు. ఒక్కసారి బ్యాటరీని మొత్తం చార్జింగ్‌ చేస్తే.. 154 కిలోమీటర్లు ప్రయాణించగలమన్నారు. ఈ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించామని, 27 కిలో వాట్స్‌ మోటార్‌తో 130 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. అడ్వాన్స్‌ బ్యాటరీ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఉందని, రెగ్యులర్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా అందిస్తున్నాని వివరించారు.
కార్గో విభాగంలో సరికొత్త ఆవిష్కరణ
టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీశ్‌ వాఘ్‌ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ కార్లు, బస్సులను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు వివరించారు. కార్గో విభాగంలో టాటా ఏస్‌ ఈవీ ఎంతో ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల క్రితం టాటా ఏస్‌ మినీ తీసుకొచ్చామని గుర్తు చేశారు. మార్కెట్‌లోని పరిస్థితులకు అనుగుణంగా వాహన రంగాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నామన్నారు. లాజిస్టిక్‌ సర్వీసులతో జతకట్టి ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే.. 500 కిలోమీటర్లు ప్రయాణించే అవిన్యాను కూడా కొన్ని రోజుల క్రితమే లాంచ్‌ చేశామన్నారు. అధిక దూరం ప్రయాణించేలా విద్యుత్‌ వాహనాలు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని వివరించారు. తొలి తరం ఈవీ వాహనాల ప్రయాణ దూరం 250 కి.మీ నిర్ణయించుకున్నామని, రెండో తరం 400-500 కి.మీ ప్రయాణించేలా చూస్తామన్నారు. మూడో తరమైన అవిన్యా 500 కి.మీ అంతకుమించిన ప్రయాణం లక్ష్యమని టాటా మోటార్స్‌ తెలిపింది.

————

ఆర్‌బీఐ నిర్ణయం సరైందే!
సరైన సమయంలోనే పెంపు
ఒత్తిడిలో దేశ ఆర్థిక వ్యవస్థ
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
వడ్డీ రేట్ల పెంపు అనివార్యమైంది..
ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌
న్యూఢిల్లిd : ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ స్పందించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. 40 బేసిస్‌ పాయింట్లు పెంచినట్టు వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా వడ్డీ రేట్లు పెంచలేదని, స్టేటస్‌ కోను కొనసాగిస్తూ వచ్చిందని, కానీ ఆర్థికపరమైన ఒత్తిడి కారణంగా.. తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని వివరించారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకున్నదని, ధరలను నియంత్రించేందుకు నిర్ణయించిందని, సబ్సిడీలు పెంచుతుందని తెలిపారు. గరబీ కళ్యాన్‌ యోజన పథకం కింద సరుకుల కేటాయింపులు పెంచామన్నారు. మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతంగా నమోదైందని, వరుసగా మూడో నెల కూడా.. ఆర్‌బీఐ అంచనా కంటే.. 2-4 శాతం పెరిగిందన్నారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో దేశీయ ఆహార ధాన్యాలపై కూడా దీని ప్రభావం పడుతున్నదని వివరించారు. అమెరికా ఫెడ్‌ బ్యాంక్‌ కూడా వడ్డీ రేట్లను పెంచిందని గుర్తు చేశారు.

—————

ఓలా కార్స్‌ సీఈఓ..
అరుణ్‌ రాజీనామా!
సీఎఫ్‌ఓ అరుణ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లిd : ఓలా కార్స్‌ సీఈఓ అరుణ్‌ సర్‌దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. అరుణ్‌ సర్‌ దేశ్‌ముఖ్‌ బాధ్యతలను కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) జీఆర్‌ అరుణ్‌ కుమార్‌కు అప్పగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఓలా గ్రూప్‌ ప్రతినిధి స్పందించాడు. సీఎఫ్‌ఓ జీఆర్‌ అరుణ్‌ కుమార్‌కు ఓలా కార్స్‌ సీఈఓ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపాడు. గో టు మార్కెట్‌ (జీటీఎం) కార్యకలాపాలు కూడా అరుణ్‌ కుమార్‌ చూసుకుంటున్నారని స్పష్టం చేశాడు. జీటీఎం హెడ్‌గా ఉన్న అరుణ్‌ సర్‌ దేశ్‌ముఖ్‌ తప్పుకోవడంతో అరుణ్‌ కుమార్‌కు అవకాశం ఇచ్చినట్టు వివరించారు. జీటీఎంతో పాటు ఓలా కార్స్‌ బాధ్యతలు అరుణ్‌ సర్‌ దేశ్‌ముఖ్‌ చూసుకునేవాడని, ప్రస్తుతం అరుణ్‌ కుమార్‌ జీఆర్‌కు ఈ బాధ్యతలను అదనంగా అందజేస్తున్నామని స్పష్టం చేశాడు. ఓలా సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ వ్యాపారానికి నాయకత్వం వహించే బాధ్యతను తీసుకునే ముందు.. దేశ్‌ముఖ్‌ ఓలా ఎలక్ట్రిక్‌ కోసం గో టు మార్కెట్‌ వ్యూహ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఓలా కంపెనీలో అడుగుపెట్టే ముందు అరుణ్‌ సర్‌దేశ్‌ముఖ్‌.. ఫ్యాషన్‌ వ్యాపారం కొనసాగించే అమెజాన్‌లో పని చేశాడు. ఓలా కంపెనీలో 90 శాతం రెవెన్యూ రైడింగ్‌ బిజినెస్‌ ద్వారానే వస్తున్నది. ఓలా కార్స్‌తో పాటు క్లౌడ్‌ కిచెన్‌ బిజినెస్‌ ఓలా ఫుడ్స్‌, క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ ఓలా డ్యాష్‌, ఫిన్‌టెక్‌ బిజినెస్‌ ఓలా మనీ వంటి సేవలు అందిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement