Friday, November 22, 2024

Exports | యూఏఈకి భారత పైనాపిల్స్‌..

భారతదేశ పండ్ల ఎగుమతులలో మరో ముందడుగు పడింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి మనదేశం నుంచి కొత్త ప్రీమియం క్వాలిటీ ఎండీ-2 రకం పైనాపిల్‌లు ఎగుమతి అయ్యాయి. గురువారం మొదటి కార్గొను అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) జెండా ఊపి ప్రారంభించింది. మొత్తం 8.7 టన్ను పైనాపిల్స్‌ ఈ కార్గో ద్వారా రవాణా అవుతున్నాయి.

‘ఇది భారతదేశ వ్యవసాయ ఎగుమతి చరిత్రలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ప్రపంచ మార్కెట్‌లకు ప్రీమియం నాణ్యమైన పైనాపిల్‌లను ఉత్పత్తి చేసి సరఫరా చేయగల మన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది” అని ఏపీఈడీఏ పేర్కొంది. ‘గోల్డెన్‌ రైప్‌” లేదా ”సూపర్‌ స్వీట్‌” అని కూడా పిలువబడే ఎండీ-2 రకం పైనాపిల్‌ పరిశ్రమలో గోల్డెన్‌ క్వాలిటీగా గుర్తింపు పొందింది. ఈరకం కోస్టారికా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో మాత్రమే గణనీయంగా సాగవుతుంది.

కొంకణ్‌ ప్రాంతంలో సాగు..

మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలోని సింధుదుర్గ్‌ జిల్లాలో ఉత్పత్తి చేయబడిన ఎండీ-2 పైనాపిల్‌ కోసం ఐసీఏఆర్‌, సీసీఏఆర్‌ఐ కోత అనంతర నిర్వహణ, రవాణా అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించింది. ఒక ప్రైవేట్‌ సంస్థ స్థానిక రైతుల భాగస్వామ్యంతో 200 ఎకరాల్లో ఈ రకాన్ని విజయవంతంగా పెంచి, సరైన నాణ్యత, దిగుబడికి కృషిచేస్తోంది. ఇక్కడ పండించిన పైనాపిల్స్‌ను నవీ ముంబైలోని పన్వెల్‌లో క్రమబద్ధీకరించి, ప్యాక్‌ చేసి, నిల్వ చేశారు. అక్కడి నుండి యూఏఈకి ఎగుమతి చేసేందుకు జవహర్‌లాల్‌ నెహూ పోర్ట్‌ ట్రస్ట్‌ (జెఎన్‌పిటి)కి రవాణా చేయబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement