ప్రముఖ హాస్పిటాలిటీ చైన్, దేశీయ యునికార్న్ సంస్థ ఓయో అమెరికాలో తన కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ లాడ్జింగ్ ఫ్రాంచైజీ, మోటల్ 6, స్టూడియో 6 బ్రాండ్లను నడుపుతున్న జీ6 హాస్పిటాలిటీ సంస్థను కొనుగోలు చేయనుంది.
బ్లాక్‌స్టోన్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి 525 మిలియన్ డాలర్లకు ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఓయో మాతృసంస్థ ఓర్వల్ స్టేస్ శనివారం ప్రకటించింది. ఈలావాదేవీ పూర్తి నగదు రూపంలో జరగనుందని తెలిపింది. భారత్‌లోని ప్రధాన నగరాల్లో సేవలందిస్తున్న ఓయో, 2019లో అమెరికాలోకి ప్రవేశించింది.
ప్రస్తుతం 35 రాష్ట్రాలలో 320కిపైగా హోటళ్లను నిర్వహిస్తోంది. గతేడాది 100 హోటళ్లను కొనుగోలు చేసింది. ఈ ఏడాది మరో 250 హోటళ్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మోటల్ 6, స్టూడియో6 బ్రాండ్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
2024లో నాలుగో త్రైమాసికానికి కొనుగోలు పూర్తవుతుందని అంచనా. ఈ సందర్భంగా ఓయో ఇంటర్నేషనల్ సీఈవో గౌతమ్ స్వరూప్ మాట్లాడుతూ ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా తమ ఉనికికి కీలక మైలురాయని అభిప్రాయపడ్డారు. మోటల్ 6కి అమెరికాలో మంచి గుర్తింపు ఉందని, ఓయో అనుభవంతో మరింత వృద్ధి సాధిస్తామని, వేరే సంస్థగానే దీన్ని కొనసాగిస్తామని చెప్పారు. అమెరికా, కెనడాలో మోటల్ 6కి సుమారు 1500కిపైగా హోటళ్లు ఉన్నాయి.