దేశంలో విద్యుత్ వాహనాల పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇంకా ఈ పరిశ్రమ ప్రారంభ దశలోనే ఉంది. ఇది మరింతగా వృద్ధి చెందాలంటే ప్రభుత్వ చేయూత అవసరమని పరిశ్రమ భావిస్తోంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో కూడా ఫేమ్ సబ్సిడీ కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీ బ్యాటరీలపై జీఎస్‌టీని మరింత తగ్గించాలని ఈవీ కంపెనీలు, సంస్థలు కోరుతున్నాయి. వాహనం ధరలో ఎక్కువగా బ్యాటరీనే ఉంటోంది. దీని ధర తగ్గితే విద్యుత్ వాహనాల ధరలు కూడా తగ్గి మరింత ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విన్నవించాయి.
ఈ బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు ట్యాక్స్ క్రెడిట్స్, సబ్సిడీలు, తక్కువ వడ్డీ రేటుకు రుణాలు వంటివి కూడా బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి ప్రకటించాలని కోరుతున్నారు. విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు ఇతర వాహనాల రుణాలకు వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల కంటే తక్కువకు ఇవ్వాలని పరిశ్రమ కోరుతోంది. ఫేమ్ సబ్సిడీని కాలపరిమితిని పొడిగించాలని గోడావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ హైదర్ ఖాన్ కోరారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం మరింత పెరగాలని ఆయన కోరారు. విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు కూడా రాయితీలు ఇవ్వాలన్నారు. ఈ చర్యల మూలంగా పరిశ్రమ వృద్ధి చెందడంతో పాటు, వాహన కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని, పరిశ్రమ వృద్ధి చెందితే ఉపాధ అవకాశాలు కూడా పెరుగుతాయని హైదర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ వాహన రంగానికి ప్రభుత్వం రుణాలను మరింత అందుబాటులోకి తీసుకు రావాలని జిప్ ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్ గుప్తా కోరారు.
ఈవీ సంబంధిత డెలివరీ సర్వీసెస్‌పై జీఎస్‌టీని 18 నుంచి 5 శాతానికి, ఈవీ వాహనాల కొనుగోలుపై జీఎస్‌టీని 5శాతంగా కొనసాగించడంతో పాటు మరిన్ని విభాగాల్లోనూ జీఎస్‌టీ తగ్గించాలని ఆయన కోరారు. వచ్చే బడ్జెట్లో ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని వెసులుబాట్లు ప్రకటించాలని డెల్టా ఎలక్ట్రానిక్స్ ఎండీ నిరంజన్ నాయక్ కోరారు. ఈవీ కంపోనెంట్స్‌పై డ్యూటీలను తగ్గించాలని ఆయన సూచించారు. మొత్తంగా విద్యుత్ వాహనాల ధరలు తగ్గేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈవీ వాహనాల పెరగేందుకు బ్యాటరీ స్వైపింగ్ ఎంతో కీలకమైనదని, దీన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని రేస్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు అరుణ్ శ్రేయాస్ కోరారు. ఫిక్స్‌డ్ బ్యాటరీలో విక్రయిస్తున్న విద్యుత్ వాహనాలకు బ్యాటరీలపై 5శాతం జీఎస్‌టీ విధిస్తున్నారని, స్వైపబుల్ బ్యాటరీలతో విక్రయించే వాహనాలకు బ్యాటరీలపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారని, దీన్ని తగ్గించాలని ఆయన కోరారు. మధ్యంతర బడ్జెట్‌లో ఈ మేరకు ఆర్ధిక మంత్రి జీఎస్‌టీ రేటును సవరించాలని కోరారు. విద్యుత్ వాహనాల రంగానికి రుణాలను ప్రాధాన్యాత రంగం (పీఎస్‌ఎల్) గా గుర్తించాలని బిలైవ్ వ్యవస్థాపకుడు, సీఈఓ సమర్ధ్ ఖోల్కర్ కోరారు.