వివాదాల పరిష్కారం కోసం జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యూనల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) ట్రిబ్యూనల్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రేమ్‌వర్క్‌ను పూర్తి చేసింది. కేంద్ర స్థాయిలో ఒక ట్రిబ్యూనల్, రాష్టాల్లో ఒకటి కంటే ఎక్కువ ఏర్పాటు చేయాలని జీఓఎం సిఫార్సు చేసింది. కేంద్ర అపిలేట్ ట్రిబ్యూనల్‌ను న్యూఢిల్లిలో ఏర్పాటు చేస్తారు. పెద్ద రాష్ట్రాల్లో 5 వరకు ట్రిబ్యూనల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రిబ్యూనల్స్‌లో సభ్యుల నియామకాల విషయంలోనూ నిబంధనల సరళీకరణపై అభిప్రాయం చెప్పాలని జీఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను కోరింది.
జీఓఎంకు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నాయకత్వం వహిస్తున్నారు. వీరి నివేదికను వచ్చే వారం జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. సెప్టెంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. సభ్యుల నియామకంపై కూడా కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. జీఓఎం సిఫార్సులను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన తరువాత అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లనూ జీఎస్టీ అపిలేట్ ట్రిబ్యూనల్స్‌ను ఏర్పాటు చేస్తారు.