Monday, November 25, 2024

384 ఔషధాలతో అత్యవసర మందుల జాబితా

జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. కొత్త జాబితాలో 384 ఔషధాలు ఉన్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్‌ లాంటి యాంటి ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు. రనిటైడిన్‌తో పాటు 26 మందులకు అత్యవసర జాబితా నుంచి తొలగించారు. ప్రముఖ యాంటాసిడ్‌ అయిన రనిటైడిన్‌ను జాబితా నుంచి తొలగించడంతో ఇకపై జిన్‌టాక్‌, రాంటాక్‌ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల జాబితాలో ఉండవు.

జాతీయ అత్యవసర మందుల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉందని ఆయన తెలిపారు. ఈ జాబితాలో చేర్చిన యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఎండోక్రైన్‌ మందులు, ఇన్సులిన్‌ గ్లార్గిన్‌, ఐవర్‌మెక్టిన్ వంటి 34 రకాల ఔషధాలను కొత్తగా జాబితాలో చేర్చారు. రనిటైడిన్‌, సక్రాల్‌ఫేట్‌, ఆటినోలాల్‌ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు. మందుల ధరలు, ఉత్తమ ఔషధాల లభ్యత తదితర కారణాలతో ఈ మందులను జాబితా నుంచి తొలగించామని ఆయన తెలిపారు. 2015 తరువాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను అప్‌డేట్‌ చేశారు. 350 మందికిపైగా నిపుణులతో అనేక సార్లు చర్చలు జరిపిన తరువాత ఈ జాబితాను రూపొందించామని కేంద్ర మంత్రి మాండవీయ తెలిపారు.

క్యాన్సర్‌ కారకమని…

ప్రముఖ యాంటాసిడ్‌ సాల్ట్‌ అయిన రనిటైడిన్‌ ఔషధాన్ని దేశంలో అసిలాక్‌, జిన్‌టాక్‌, రాంటాక్‌ వంటి బ్రాండ్ల పేరుతో అమ్మతున్నారు. ఎసిడిటీ, కడుపునొప్పి సంబంధిత సమస్యలకు ఈ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న మందుల్లో ఇది ఒకటి. ఇందులో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని 2019లో అమెరికాలో ఒక పరిశోధన వెల్లడించింది. అప్పటి నుంచి దీని వినియోగంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ కారణం వల్లే బహుశ అత్యవసర మందుల జాబితా నుంచి వీటిని తొలగించి ఉంటారని భావిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement