ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్ కొనుగోలు వ్యవహారం పూర్తయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేశారు. తాను డబ్బు కోసం కొనుగోలు చేయలేదని మస్క్ చెప్పారు. తాను ప్రేమించే మానవాళి కోసం మంచి ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే తన ఉద్దేశమని చెప్పారు. ప్రకటనదారులను ఉద్దేశిస్తూ ఆయన ఓ సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ట్విటర్‌లో ప్రకటనపై తన ఉద్దేశానికి సంబంధించిన అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని అవి నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే తరానికి ఓ ఉమ్మడి డిజిటల్ వేదిక ఉండటం చాలా ముఖ్యమని, ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా అది ఉండాలని, హింసకు తావుండొద్దని, ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు రెండు భిన్న ధృవాలుగా విడిపోయి విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల చర్చకు అవకావం లేకుండా పోతుందని, దీని కోసమే తాను ట్విటర్‌ను కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఏదైనా చెప్పడానికి అందరికీ ట్విటర్ ఉచిత వేదిక కాబోదని, నిబంధనలు, చట్టాలకు కట్టబడి ఉంటూనే అందరికీ అందుబాటులో ఉండాలని, అన్ని వర్గాలకు నచ్చిన ఎంపికలను అందించేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
ట్విటర్‌ను ఒక్కోషేరుకు 54.20 డాలర్లు చెల్లించి, మొత్తం 44 బిలియన్ డాలర్లకు దీన్ని కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లోనే ఈ ఒప్పందం ఖారారు అయ్యింది. కార్యరూపం దాల్చేందుకు ఆరు నెలల సమయం పట్టింది. జులైలో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో ఈ నెల 28లోగా ఈ కొనుగోలు వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చాలని మస్క్‌కు గడువు విధించింది. ఈ గడువులోగానే ఆయన డీల్‌ను పూర్తి చేశారు.
సీఈవో పై వేటు
ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్ కొన్ని గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను తొలగించారు. ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెను పదవుల నుంచి తొలగించారు. వీరితో పాటు 2017 నుంచి సంస్థలో ఉన్న సీఎఫ్‌ఓ నెడ్ సెగల్, 2012 నుంచి కంపెనీలో ఉన్న జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ ఉద్వాసనకు గురైన వారిలో ఉన్నారు. కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తరువాత కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేయడంతో ఈ నలుగురు కీలకంగా వ్యవహారించారు. త్వరలోనే మరికొంత మంది ముఖ్యులను కూడా తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్ నెలలో జాక్ డోర్సే స్థానంలో పరాగ్ అగర్వాల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఒప్పందం ప్రకారం పరాగ్‌ను పదవి నుంచి 12 నెలల్లోగా తొలగిస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డులోని ఇతర సభ్యుల పరిహారంపైనా మస్క్ అసహనంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
లీగర్ హెడ్‌గా ఉన్న విజయ గద్దెను కూడా మస్క్ తొలగించారు. ఆమెను తొలగిస్తే కంపెనీ ఆమెకు 12.5 మిలియన్ డాలర్లు పరిహారం తో పాటు షేర్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో విజయ ఒకరు. అభ్యంతరకరమైన పదాలు, పోస్టులు, వాక్ స్వాతంత్య్రంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తిన సమయంలో విజయ ట్విటర్‌ను గాడిన పెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. అనేక చిక్కులను ఎదుర్కొని చివరకు వినియోగదారుల హక్కుల రక్షణ కోసం అవసరమైన విధానాలను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివాదాస్పద ట్విట్లతో ప్రజల అసహనానికి కారణమవుతున్న వారి అకౌంట్లను నిషేధించేందుకు ఆమె వెనుకాడలేదన్న పేరు ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ ఖాతాను సైతం ఆమె తొలగించారు.
ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తారంటూ వచ్చిన వార్తలను మాత్రం ఎలాన్ మస్క్ తోసిపుచ్చారు. ట్విటర్‌ను ఆయన కొనుగోలు చేసిన తరువాత 75 శాతం ఉద్యోగులను తొలగిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై ఉద్యోగులకు ఒక లేఖ రాస్తూ, ఎలాంటి ఆందోళన అక్కలేదని భరోసా ఇచ్చారు.
నిబంధనలు పాటించాలి
ఇకనైనా ట్విటర్ కొత్త యాజమాన్యం కింద భారత్‌లో చట్టాలను, నిబంధనలను అమలు చేయాలని భారత్ కోరింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు, కొత్త నిబంధనలు భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరంగా ఉన్నాయని ట్విటర్ గతంలో విమర్శించింది. వీటి అమలు చేసేందుకు అంగీకరించకోవడంతో భారత ప్రభుత్వానికి , ట్విటర్‌కు మధ్య వివాదం నెలకొంది. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం గతంలో గట్టిగా కోరింది.