Saturday, November 23, 2024

ట్విటర్‌ బోర్డు సభ్యులపై వేటు.. పూర్తి ప్రక్షాళనకు ఎలాన్‌ మస్క్ రెడీ

ట్విటర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అందులో సమూల ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఈఓతో పాటు కీలక పదవుల్లో ఉన్న పలువురిని తొలగించిన ఆయన, 25 శాతం మంది ఉద్యోగులను కూడా తొలగించాలని నిర్ణయించుకన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ట్విటర్‌ బోర్డు సభ్యులందరిపైనా వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్‌ బోర్డులో తానే ఏకైక సభ్యుడినని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించారు. దీంతో ట్విటర్‌ సీఈఓ పదవిని మస్క్‌ చేపట్టనున్నారని తెలుస్తోంది.

ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి బోర్డు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై బోర్డు సభ్యులుగా కొనసాగుతారని ఎలాన్‌ మస్క్‌ తన ఫైలింగ్‌లో పేర్కొన్నారు. వీరిలో మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో డైరెక్టర్‌గా తాను ఒక్కడినే ఉన్నానని, ఇది తాత్కాలికమేనని తెలిపారు. బోర్డులో ఏకైక డైరెక్టర్‌గా ఉన్న ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ట్విటర్‌ కొత్త ఇన్వెస్టర్లలో సౌదీ యువరాజు అల్వలీద్‌ బిన్‌ తలాల్‌, ట్విటర్‌ సహా వ్యవస్థాపకుడు జాన్‌ డోర్సె ఉన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా వెల్లడైంది. సౌదీ యువరాజుకు చెందిన కింగ్‌డమ్‌ హోల్డింగ్‌ కంపెనీ ట్విటర్‌లో 35 మిలియన్ల షేర్లు 1.9 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెల్సింది. దీంతో మస్‌ ్క తరువాతత రెండో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా సౌదీ యువరాజు ఉండనున్నారు. జాక్‌ డోర్సే 978 మిలియన్‌ డాలర్లతో 18 మిలియన్ల షేర్లు కొనుగోలు చేశారు. వీరితో పాటు ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ కూడా ఇన్వెస్టర్‌గా ఉంది.

- Advertisement -

ఎలాన్‌ మస్క్‌ టీంలో మరో భారతీయుడు
ఇద్దరు భారతీయులను కీలక పదవుల నుంచి తొలగించిన ఎలాన్‌ మస్క్‌, మరో భారతీయుడికి కీలక బాధ్యతలు అప్పగించారు. ట్విటర్‌ ఈసీఓగా ఉన్న పరాగ్‌ అగర్వాల్‌ను, లీగల్‌ హెడ్‌గా ఉన్న విజయ గద్దెను ఆ పదవుల నుంచి ఆయన తొలగించారు. తాజాగా మరో భారతీయుడు, ప్రముఖ టెక్‌ నిపుణుడిగా పేరున్న శ్రీరామ కృష్ణన్‌ ఆయనకు సలహాలు ఇస్తున్నారు.
కొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి ఎలాన్‌ మస్క్‌కు తాత్కాలికంగా సాయం చేస్తున్నట్లు శ్రీరామ కృష్ణన్‌ ట్విట్‌ చేశారు. ట్విటర్‌ను ముఖ్యమైన సంస్థగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంపై ఇది చాలా ప్రభావం చూపుతుందని భావిస్తున్నానని, అందుకు మస్క్‌నే సరైన వ్యక్తి అని కృష్ణన్‌ తన ట్విట్‌లో పేర్కొన్నారు.

కృష్ణన్‌ది చెన్నయ్‌
శ్రీరామ కృష్ణన్‌, ఆయన సతీమణి ఆర్తీ రామమూర్తి ఇద్దరూ చెన్నయ్‌లోనే పుట్టి పెరిగారు. వీరిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. 2003లో ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారని ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం శాన్‌ప్రాన్సిస్కోలో ఉంటున్న కృష్ణన్‌, ఆర్తీ 2010లో అమెరికా వెళ్లారు.
మైక్రోసాఫ్ట్‌తో ఆయన తన ఉద్యోగ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. విండోస్‌ అజూర్‌కు సంబంధించిన పలు ప్రాజెక్ట్‌ల్లో పని చేశారు. ప్రోగ్రామింగ్‌ విండోస్‌ అజూర్‌ అనే పుస్తకాన్ని రాశారు. ప్రముఖ ఆడియో యాప్‌ క్లబ్‌హౌస్‌లో సతీమణి ఆర్తీ రామమూర్తితో కలిసి ది గూడ్‌ టైమ్స్‌ షో అనే షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జుకర్‌ బర్గ్‌, స్టీవ్‌ బామర్‌ వంటి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు.

ప్రస్తుతం ఆయన సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పని చేస్తున్న వెంచర్‌ క్యాపిట్‌ సంస్థ అడ్రిసెస్‌ హోరోమిట్జ్‌( ఏ16జెడ్‌)లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన పలు టెక్‌ కంపెనీల్లో కీలక ప్రాజెక్ట్‌ల్లో పని చేశారు. ప్రస్తుతం ట్విటర్‌లో అనేక కీలక మార్పుల్లో ఆయన ఎలాన్‌ మస్క్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఆయన సూచనలతోనే అనేక మార్పుులకు మస్క్‌ శ్రీకారం చుట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement