చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమి తొలి విద్యుత్ కారును త్వరలో విడుదల చేయనుంది. షావోమి ఎస్‌యూ 7 పేరుతో తీసుకు వస్తున్న ఈ కారు అమ్మకాల కోసం ప్రభుత్వానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. షావోమి ఈ కారును బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (బీఏఐసీ)కి కాంట్రాక్టు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ దరఖాస్తు చేసుకుంది.
ఈ శాఖ ప్రతి నెలా కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంది. షావోమి కారు గురించి ఈ సంస్థ వెబ్‌సైట్ ద్వారానే వెలుగులోకి వచ్చింది.బీఏఐసీ ఓఆర్‌వీ షావోమి బ్రాండెడ్ మోడల్‌లో 3 వెరియంట్స్‌ను తయారు చేయనుంది. ఎస్‌యూ7 మోడల్ కారులో బీవైడీ కంపెనీకి చెందిన లిథియం ఆయాన్ పాస్పేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 210 కి.మీ.గా ఉంటుంది. రెండో మోడల్ ఎస్‌యూ7 మ్యాక్స్ సీఏటీఎల్ నికెల్ కోబాల్ట్ ఆధారిత లిథియం బ్యాటరీతో వస్తుంది.
ఈ కారు టాప్ స్పీడ్ 265 కి.మీ. మూడో మోడల్ ఎస్‌యూ7 ప్రో పేరుతో వస్తుంది. ఈ మూడు కార్లకు ముందు భాగంలో ఎంఐ లోగోతో వస్తున్నాయి. వెనుక వైపు షావోమి కంపనీ బ్రాండ్ పేరు ఉంటుంది. ఈ కార్లలో లైడర్ సెన్సర్ ఉంటుంది. బీ పిల్లర్‌పై కెమెరా ఉంటుంది. ఇందులో ఫేస్ రికగ్నిషన్ ఆన్‌లాకింగ్ ఫీచర్ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎస్‌యూ7 మోడల్‌లో 220 కిలోవాట్ మోటార్‌తో కూడి రియల్ వీల్ డ్రైవ్‌తో, మరొకటి 495 కిలోవాట్ మ్యాగ్జిమమ్ పవర్‌తో ఆల్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. టోల్ చెల్లింపుల కోసం వాహనం ఆపాల్సిన అవసరంలేకుండా ఈటీసీ ఫంక్షన్ వ్యవస్థను కూడా పొందుపర్చారు. స్మార్ట్‌ఫోన్ సహా కార్లలోనూ ఉపయోగించేలా హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ దీని కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
5 సీట్లతో వస్తున్న ఈ కారు వాణిజ్య తయారీని 2023 డిసెంబర్‌లో ప్రారంభించింది. 2024 ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు సరఫరా మొదలు పెట్టనున్నారు. బీఏఐసీలో ఇప్పటికే ఈ కార్ల తయారీ ప్రారంభమైంది. ఈ కంపెనీ ఇప్పటికే చైనా మార్కెట్ కోసం మెర్‌సడెస్ బెంజ్ కారును ఉత్పత్తి చేస్తుంది. 2021లో తాము ఈవీ కార్ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్లు షోవోమి కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.