Friday, November 22, 2024

చైనా లోన్‌ యాప్‌ కేసులో ఈడీ సోదాలు

చైనా రుణ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రేజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ ఫ్రీ వంటి ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సంస్థల కార్యాలయాల్లో శనివారం నాడు సోదాలు నిర్వహించింది. బెంగళూర్‌లోని ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ దాడులు జరిపినట్లు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. చైనాకు చెందిన పలు లోన్‌ యాప్‌ సంస్థలకు ఈ పేమెంట్‌ గేట్‌వేలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆయా సంస్థల బ్యాంక్‌ అకౌంట్లు, మర్చెంట్‌ ఐడీల నుంచి 17 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. లోన్‌ యాప్‌ సంస్థలు భారతీయుల నకిలీ ఖాతాలు ఉపయోగించి, డమ్మీ డైరెక్టర్లను పెట్టి నేరాలకు పాల్పడుతున్నట్లు ఈడీ తెలిపింది. ఈ మొత్తం వ్యవహరాన్ని మాత్రం చైనాకు చెందిన వ్యక్తులే నియంత్రించే వారని ఈడీ పేర్కొంది. పేటీఎం వంటి పేమెంట్‌ గేట్‌వేల ఉన్న మర్చెంట్‌ ఐడీ, ఖాతాల ద్వారా అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు గుర్తించినట్లు ఈడీ తెలిపింది. రేజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ ఫ్రీ, కొన్ని చైనా నియంత్రణ సంస్థల కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

రుణ యాప్‌ల ఆగడాలపై బెంగళూర్‌ పోలీసులు 18కి పైగా కేసులు నమోదు చేశారు. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తోంది. దేశ వ్యప్తంగా ఇలాంటి మోసాలే అనేకం వెలుగు చూశాయి. వేగంగా రుణం ఇస్తామన్న పేరుతో వినియోగదారులను ఆకర్షించిన ఈ సంస్థలు తరువాత వారిని తీవ్రంగా వేధించేంది. ఈ సంస్థలు రుణాలు తీసుకున్న వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సంస్థలు అడిగినంత వడ్డీ ఇవ్వని వారిపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో ఈ సంస్థలపై అనేక పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే ఈడీ చైనా రుణ యాప్‌లపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. సంవత్సరంన్నర క్రితమే ఈడీ అధికారులు తమకు చెందిన కొన్ని బ్రాంచ్‌ల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం అధికారులు మరింత అదనపు సమాచారం అడిగారని, వారు అడిగిన సమాచారాన్ని కేవైసీ వివరాలను అందించామని రేజోర్‌ పే ప్రతినిధి తెలిపారు. తాము ఇచ్చిన సమాచారం పట్ల ఆధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని, వారు అడిగిన సమాచారం మొత్తం అందచేశామని క్యాష్‌ ఫ్రీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement