Friday, November 22, 2024

ఆర్టీసీకి దసరా ధమకా.. కలిసొచ్చిన పండుగ, 195 కోట్ల ఆదాయం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆర్టీసికి దసరా పండుగ బాగా కలిసి వచ్చింది. భారీ ఆదాయాన్ని అర్జించింది. ఓఆర్‌ కూడా పెరిగింది. దసరా పండగ కోసం సెప్టెంబర్‌ 24వ తేదీ నుంచి ఈనెల 5వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ 4,198 ప్రత్యేక బస్సులను నడిపించింది. దసరాకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా సోమవారం వరకు సుమారు రూ.195 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ క్రమంగా లాభాలబాట పడుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా దసరా సీజన్‌లో సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం రాబట్టినట్లు తెలుస్తోంది. దసరా పండుగ రోజున దాదాపు రూ.6కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. పండుగ రోజు కాకుండా మిగిలిన రోజుల్లో ప్రతి రోజు సగటున రూ.13కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఆదివారం వరకు రూ.183 కోట్ల ఆదాయం రాగా, దసరా పండుగ సెలవులకు ఊరెళ్లి సోమవారం రోజు వేలాది మంది ప్రయాణికులు పల్లె నుంచి పట్నం బాట పట్టారు. దాంతో సోమవారం ఆదాయాన్ని కూడా కలుపుకుంటే సుమారు రూ.195 కోట్ల వరకు ఆదాయం రావచ్చనే అంచనాకు అధికారులు వస్తున్నారు. 10వ తేదీ నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభం అవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీ ఎత్తున తిరిగి ఊళ్లకు వస్తున్నారు. ఈనెల 6, 7, 8, 9 తేదీల్లోనే దాదాపు రూ.55 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

చాలా మంది పండుగ తెల్లారి నుంచి ఊళ్లకు తిరుగుముఖం పట్టడంతో ఈ స్థాయిలో ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. తెలంగాణ జిల్లాలకే కాకుండా ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు ప్రత్యేక బస్సులను నడిపింది. బెంగుళూరు, కర్నూలు, విఖాశపట్టణం, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడిపిస్తోంది. బెంగుళూరుకు తిరిగి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ బస్సులను నడిపించింది. గత ఆదివారం ఒక్క రోజే బెంగుళూరుకు 25 వరకు స్పెషల్‌ బస్సులను నడిపినట్లు తెలిసింది. అదేవిధంగా శ్రీశైలం, తిరుపతి, యాదాద్రిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. పండగ సీజన్‌లో ఆక్యుపెన్సీ రేషియో రెండు శాతానికి పైగా పెరిగినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement