Saturday, November 23, 2024

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,113 కోట్లు.. త్రైమాసికంలో అత్య‌ధిక ఆదాయం ఇదేన‌న్న కంపెనీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,113 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.992 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి ఆదాయం 9 శాతం పెరిగి రూ.5,763 కోట్ల నుంచి రూ.6,306 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. ఒక త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదేనని కంపెనీ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో రష్యాలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం, ఫారెక్స్‌ రేట్లలో అనుకూల మార్పులు కంపెనీపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా మార్కెట్లో లెనాలిడోమైడ్‌ క్యాప్సుల్స్‌ను విడుదల చేయడం ఫలితాలు ఆకర్షణీయంగా ఉండడానికి దోహదం చేసిందని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ చైర్మన్‌, జీవీ ప్రసాద్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా రోగులకు ఆమోదయోగ్యమైన ధరల్లో అందరికీ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం, కొత్త ఔషధాలను విడుదల చేయడంపై కంపెనీ దృష్టి కొనసాగుతుందని చెప్పారు. రెండో త్రైమాసికానికి కంపెనీ గ్లోబల్‌ జెనరిక్స్‌ విక్రయాలు 18 శాతం పెరిగి రూ.4,743 కోట్ల నుంచి రూ.5,594 కోట్లకు చేరాయి. ఒక్క ఉత్తర అమెరికా విక్రయాలు 48 శాతం పెరుగుదలతో రూ.1,891 కోట్ల నుంచి రూ.2,800 కోట్లకు చేరాయి. కంపెనీ మొత్త జెనరిక్‌ విక్రయాల్లో ఉత్తర అమెరికా విక్రయాలు 44 శాతం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. యూరప్‌ అమ్మకాలు 2 శాతం పెరిగి రూ.420 కోట్లకు చేరగా.. దేశీయ విక్రయాలు ఒక శాతం మాత్రమే పెరిగి రూ.1,150 కోట్లుగా నమోదయ్యాయి. వర్థమాన మార్కెట్ల అమ్మకాలు 6 శాతం క్షీణించి రూ.1,224 కోట్లకు పరిమితమైనట్లు తెలిపింది. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement