పేమెంట్ అగ్రిగేటర్ సేవలు అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్‌కు ఆర్బీఐ సూచించింది. అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. దీనిపై స్పందించిన పేటీఎం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది. పేటీఎం బ్రాండ్‌తో వన్ 97 కమ్యూనికేషన్స్ చెల్లింపు సేవలను అందిస్తున్నది. పేమెంట్ అగ్రిగేటర్‌కు సంబందించి ఆర్బీఐ గతంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అనుసరించి తన పేమెంట్ అగ్రిగెటర్ బిజినెస్‌ను పేటీఎం పేమెంట్ సర్వీసెస్‌కు బదిలీ చేయాలని ఆర్బీఐని కోరింది. దీన్ని ఆర్బీఐ తిరస్కరించింది. దీంతో అవసరమైన పత్రాలను పేటీఎం గత సంవత్సరం సెప్టెంబర్‌లో మరోసారి ఆర్బీఐకి సమర్పించింది.
తాజాగా పేటీఎం కు మరోసారి ఆర్బీఐ నుంచి సమాచారం వచ్చింది. పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపారం నిర్వహించేందుకు 120 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ కోరింది. అనుమతులు పొందే వరకు కొత్త ఆన్‌లైన్ వ్యాపారులను చేర్చుకోవద్దని ఆర్బీఐ తమకు సూచించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేటీఎం తెలిపింది. దీని వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది. ఆన్‌లైన్ వ్యాపారులను చేర్చుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని పేర్కొంది. అలాగే ఇప్పుడున్న ఆన్‌లైన్ వ్యాపారులతో వ్యాపారం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. త్వరలోనే సంబంధిత అనుమతులు లభిస్తాయని పేటీఎం ఆశాభావం వ్యక్తం చేసింది.
వివిధ పద్ధతుల ద్వారా ఇ-కామర్స్ వ్యాపారులకు వినియోగదారులు చెల్లింపులు చేస్తుంటారు. వ్యాపారులకు ప్రత్యేకమైన చెల్లింపుల వ్యవస్థ అంటూ అవసరం లేకుండా లావాదేవీలు పూర్తి చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం , ఇ-కామర్స్ సేవలతో పాటు, పేమెంట్ అగ్రిగేటర్ సేవలను ఒకే కంపెనీకి అందించడానికి వీల్లేదు. అందుకు వేరే వ్యాపారంగా ఉండాలి. ఈ నేపథ్యంలో పేమెంట్ అగ్రిగేటర్ సేవలను, పేటీఎం పేమెర్ సర్వీసెస్‌కు బదిలీ చేయాలని వన్ 97 కమ్యూనికేషన్ ఆర్బీఐనికి కోరింది. మరోవైపు రోజర్ పే, ఫై న్‌ల్యాబ్స్, క్యాష్ ఫ్రీ, సీసీ అవెన్యూస్ వంటివి ఇప్పటికే పేమెంట్ అగ్రిగేటర్ అనుమతులు పొందాయి. బిల్ డెస్క్, పేయూ వంటివి ఆర్బీఐ నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.