ఇటీవల ప్రతిపాదించిన డిజిటల్ రుణ నిబంధనలు నవంబర్ నుంచి అమల్లోకి రానున్నా యని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు తెలిపారు. రెగ్యులేటరీ ఆర్బిట్రేజీకి చెక్ పెట్టేందుకు, వినియోగదారులను రక్షించడానికి ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని చెప్పారు. అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. హద్దుల్లేని థర్డ్‌పార్టీల జోక్యాన్ని తగ్గించడం, డేటా గోప్యత ఉల్లంఘన, అనైతిక పునరుద్ధరణ పద్ధతులు, అధిక వడ్డీరేట్ల వంటి పరిస్థితులు ఇటీవల ఆర్‌బీఐ కార్యకలాపాలను నియంత్రించడానికి దారితీశాయని చెప్పారు. విస్తృత సంప్రదింపుల తర్వాత ఆగస్టు 10న ఆర్‌బీఐ డిజిటల్ రుణ నిబంధనలను విడుదల చేసింది. వీటిని ఈ ఏడాది చివరలోగా అమల్లోకి తేవాలని గతవారం పరిశ్రమను కోరింది. వినూత్నమైన, సమ్మిళిత వ్యవస్థ అవశ్యకత మధ్య సమతుల్యతను సాధించడానికి ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడింది. అదే సమయంలో వినియోగదారుల ఆసక్తికి హాని కలిగించే విధంగా మధ్యవర్తిత్వం నియంత్రణ ఉండదని రాజేశ్వరరావు చెప్పారు.
అనధికార సంస్థలను రుణ మార్కెట్ నుంచి నిషేధించేందుకు ఈ నిబంధనలు తోడ్పడతాయని తెలిపారు. దేశ అభివృద్ధిలో డిజిటల్ రుణాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా, నగదు ఆధారిత చిరు వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. 2014లో 53శాతం వయోజనులు బ్యాంకు ఖాతాలు కలిగివుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 78 శాతానికి పెరిగిందని, ఇది నాణ్యమైన ఆర్థిక సమగ్రతకు దోహదం చేస్తుందని రాజేశ్వరరావు చెప్పుకొచ్చారు. అయితే, డిజిటల్ నిబంధనలుపై ఫిన్‌టెక్ పరిశ్రమలోని కొంతమంది ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చర్య తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.