స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్ తరువాత ప్రజల్లో మార్కెట్లపై అవగాహన బాగా పెరిగింది. ఫలితంగా దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2022 ఆగస్టు నాటికి 10 కోట్లు దాటాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 22 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలను తెరిచారు. కొవిడ్ కంటే ముందు దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.9 కోట్లు మాత్రమే.
కొవిడ్, లాక్‌డౌన్ కారణం కొవిడ్‌తో వచ్చిన లాక్‌డౌన్ సమయంలో చాలా మంది స్టాక్‌మార్కెట్ల గురించి అన్వేషించారు. వాటి తీరు గురించి తెలుసుకున్నారు. అటు తరువాత కూడా వర్క్‌ఫ్రమ్ హోం ఉండటంతో చాలా మంది ఉద్యోగం చేస్తూనే స్టాక్‌మార్కెటల్లో ట్రేడింగ్ ప్రారంభించారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం, బ్రోకరేజీ ఛార్జీలు తగ్గడం వంటి కారణాలతో యువకులు ఎక్కువగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించి, స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, ట్రేడింగ్ చేయడం ప్రారంభించారు. పొదుపు పెరిగినందున సెక్యూరిటీ మార్కెట్లను మదుపు చేసేందుకు మంచి మార్గంగా భావించినందునే డీ మ్యాట్ ఖాతాలు పెరిగాయని సీడీఎస్‌ఎల్ ఎండీ, సీఈఓ నెహాల్ వోరా తెలిపారు. రెండేళ్లలో ఖాతాల సంఖ్య గనణీయంగా పెరిగాయని, అదే సమయంలో ఏప్రిల్ 2020లో 174 లక్ష కోట్లుగా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్ కట్టడిలోని ఆస్తుల విలువ 2022 ఆగస్టు నాటికి 320 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈక్విటీ మార్కెట్‌లో భాగస్వాములవుతున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని ఎస్‌ఎస్‌డీఎల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ప్రశాంత్ పగాల్ అభిప్రాయపడ్డారు.
ఖాతాల పరంగా సీడీఎస్‌ఎల్ ముందుంది. కస్టడీలోని ఆస్తుల విలువ పరంగా ఎన్‌ఎస్‌డీఎల్ అతి పెద్ద సంస్థగా ఉంది. ఆగస్టు చివరి నాటికి సీడీఎస్‌ఎల్ 7.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు కలిగి ఉంది. వీటి కస్టడిలోని ఆస్తుల విలువ 38.5 లక్షల కోట్లు. ఎన్‌ఎస్‌డీఎల్ వద్ద 2.89 కోట్ల డిమ్యాట్ ఖాతాలు కలిగి ఉంది. 320 లక్షల కోట్ల ఆస్తుల విలువ దీని ఆధీనంలో ఉన్నాయి.
10 కోట్ల డిమ్యాట్ ఖాతాల్లో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారు ఉంటారు. చాలా మంది పలు బ్రోకరేజీ సంస్థల వద్ద ఖాతాలు ప్రారంభిస్తుంటారు. ఈ ఖాతాలు అన్ని 6 నుంచి 7 కోట్ల మంది కస్టమర్లకు చెందినవిగా ఉండవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి దేశంలో కేవలం 6 శాతం మంది మాత్రమే ఈక్విటీ మార్కెట్‌లో ఉన్నారు.
ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్‌మార్కెట్ షేర్లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఫించన్ ఫండ్లు రూపంలోనూ పెట్టుబడులు పెడుతున్నారు.
మార్కెట్ తీరును బట్టే ఖాతాలు..
సాధారణంగా మార్కెట్లు మంచి లాభాలను ఆర్జింస్తుంటే ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ఆకర్షితులవుతుంటారు. మార్కెట్ కదలికలను బట్టే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుంటారు. జూన్‌లో మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. అ సమయంలో 16 నెలల కనిష్టానికి డీమ్యాట్ ఖాతాలు పరిమితమై 18 లక్షలకు పరిమితమయ్యాయి. మార్కెట్లు పుంజుకోవడంతో ఖాతాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి.