Friday, November 22, 2024

Delhi Airport | విమాన పార్కింగ్‌కు అధిక ఛార్జీలు

సాంకేతిక, ఇతర కారణంగా విమానాలను నిలిపివేస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల ఢిల్లి విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్‌ స్థలం తగ్గిపోతున్నది. రోజువారీ కార్యకలాపాలు సాగించే విమానాల నిలిపేందుకు చోటు సరిపోవడం లేదు. ఇది విమానాశ్రయ కార్యకలాపాల సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తోంది. అందువల్ల కార్యకలాపాలు నిర్వహించకుండా, మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన విమానాలకు ఇకపై విమానయాన

సంస్థల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయాలని ఢిల్లి విమానాశ్రయాన్ని నిర్వహించే ఢిల్లి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిర్ణీత కాల వ్యవధికి మించి విమానాశ్రయంలో నిలిపి ఉంచిన విమానాలకు ఆయా సంస్థల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయలనుకుంటున్నట్లు డీఐఏఎల్‌ సీఈఓ విదేహ్‌ కుమార్‌ వెల్లడించారు. తదుపరి విమాన ట్రాఫిక్‌ సమీక్షను వచ్చే ఏడాది ప్రారంభంలో చేయనున్నారు.

- Advertisement -

నవంబర్‌ 17 నాటికి ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిర్‌ ఇండియా తదితర విమానయాన సంస్థలు 64 విమానాలను ఢిల్లి విమానాశ్రయ ప్రాంగణంలో నిలిపి ఉంచాయని డీఐఏఎల్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇండిగో విమానాలు 24, స్పైస్‌జెట్‌ విమానాలు 6, ఎయిర్‌ ఇండియా విమానాలు 2, అలియన్స్‌ ఎయిర్‌ విమానం ఒకటి చొప్పున విమానాశ్రయ ఆవరణలో నిలిపి ఉంచినట్లు తెలిపింది.

కార్యకలాపాలు సాగించని విమానయాన సంస్థ గోఫస్ట్‌ కు చెందిన 23 విమానాలను ఇక్కడే నిలిపి ఉంచింది. జూమ్‌ ఎయిర్‌ విమానాలు 5, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు 3 కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం డీఐఏఎల్‌ నిర్వహిస్తున్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఏఐ)లో 295 విమాన పార్కింగ్‌ స్టాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లి విమానాశ్రయంలో మూడు టెర్మినల్స్‌ ద్వారా సుమారు 1300-1500 విమనాలు రోజువారీగా రాకపోకలు సాగిస్తున్నాయి.

ట్రాఫిక్‌ ధోరణిని గమనించి టీ4 టెర్మినల్‌ ఏర్పాటుపై త్వరలోనే సంస్థ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం నుంచి 7 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉందని డీఐఏఎల్‌ వెల్లడించింది. జీఎంఆర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కన్సార్షియమే డీఐఏఎల్‌.

విమానయాన రంగ సలహా సంస్థ కాపా ఇండియా నివేదిక ప్రకారం ఇండిగో, ఎయిర్‌ ఇండియా, గోఫస్ట్‌, స్పైస్‌జెట్‌ సంస్థలకు చెందిన 161-66 విమానాలు దేశంలో కార్యకలాపాలు సాగించకుండా నిలిపి ఉన్నాయి. మార్చి నాటికి ఈ సంఖ్య 196-201కి చేరే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement