మన దేశం నుంచి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 2023లో 148.6 మిలియన్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరంలో పోల్చితే స్వల్పంగా 2 శాతం షిప్‌మెంట్స్ తగ్గాయి. మార్కెట్ పరిశోధనా సంస్థ కెనల్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫెస్టివ్ సీజన్‌లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. 4వ త్రైమాసికంలో 38.9 మిలియన్ యూనిట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయి. 2023లో రిటైల్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరగడంతో అమ్మకాలు పెరిగాయని, ఇది వెండర్స్‌కు ప్రయోజనం కల్గించడంతోటు మార్కెట్ స్థిరీకరణకు దారితీసిందని కెనల్స్ సీనియర్ ఎనలిస్ట్ సన్యాం చౌరసియా అభిప్రాయపడ్డారు.
2023 4వ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో శాంసంగ్ టాప్‌లో ఉంది. 7.6 మిలియన్ యూనిట్లతో కంపెనీ 20 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. షావోమీ 7.2 మిలియన్ స్మార్ట్ ఫోన్లతో రెండో స్థానంలో ఉంది. 7 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో వివో మూడో స్థానంలో ఉంది. రిలయల్ మీ 4.5 మిలియన్లు, ఒప్పో 3.7 మిలియన్ల యూనిట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ల విభాగంలో ప్రధానంగా ప్రీమియం ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.
ఈజీ ఫైనాన్స్ అవకాశాలు, కంపెనీల ఆఫర్లు, ఆదాయాలు పెరగడం వంటి కారణాలతో వీటి అమ్మకాలు పెరుగుతున్నాయని చౌరాసియా అభిప్రాయపడ్డారు. దీపావళీ సీజన్‌లో ఐఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ నెలలో ఐఫోన్ శాంసంగ్‌ను దాటి అగ్రస్థానంలోకి వచ్చింది. శాంసంగ్ ప్రీమియం సెగ్మెంట్‌లో గెలాక్సీ ఎస్ సీరిస్ ఫోన్ల అమ్మకాలు పెంచుకునేందుకు భారీగా మార్కెటింగ్ చేస్తోంది. దేశంలో స్మార్ట్ ఫోన్లలో క్రమంగా 5జీ ఫోన్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ సిగ్మెంట్‌లో కంపెనీలు పలు మోడల్స్‌ను తీసుకు వస్తున్నాయి.