గుంటూరు, ప్రభన్యూస్‌బ్యూరో: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు ఈ ఏడాది దిగుమతుల ఘాటు తగ్గింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి కొంత సరకు నేరుగా ఇతర రాష్ట్రాల్రకు వెళ్లడంతో గుంటూరు మార్కెటుకు ఆశించినంత సరకు రాలేదని అధికారులు చెబుతున్నారు. యార్డుకు సరుకు తక్కువగా వస్తుండడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన మిర్చికి గిరాకీ ఎక్కువ ఉండడంతో ఎగుమతి వ్యాపారులు మొగ్గుచూపిస్తున్నారు. ఏటా మార్చి నెలాఖరు వరకు శీతల గోదాములకు 75 లక్షల టిక్కీల వరకు వస్తుండగా, ఈఏడాది 35 లక్షల నుంచి 40 లక్షల టిక్కీలు మాత్రమే వచ్చాయి. గతంతో పోల్చితే ఇప్పటివరకు 50శాతం మాత్రమే నిండాయని యజమానులు చెబుతున్నారు.
ఇటీవల వర్షాల నేపథ్యంలో దెబ్బతిని నాణ్యత తగ్గిన మిర్చిని నిల్వచేసే అవకాశాలు మరింత తగ్గాయి. దీంతో ఏప్రిల్ నెలలోనూ శీతల గోదాములకు వచ్చే సరకు పరిమాణం తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. మార్కెట్లో అధిక ధర లభిస్తుండటంతో వచ్చిన సరకు వచ్చినట్లే విక్రయాలు జరగడం, రోజువారీగా యార్డుకు వచ్చే మిర్చి పరిమాణం తగ్గడంతో యార్డులో నిల్వ సరకు ఉండటం లేదు. యార్డుకు దిగుమతి అయిన సరుకును పరిశీలిస్తే ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో జనవరి నెలలో 5, 81, 716 క్వింటాళ్ళు, ఫిబ్రవరిలో 9,55273 క్వింటాళ్ళు, మార్చి నెలాఖరుకు 7,54, 189, ఈ నెలలో 1,40,876 టిక్కీలు యార్డుకు తీసుకొచ్చారు.
ఈ ఏడాది మెరుగైన ధరలు..
ఏటా జనవరి నుంచి మార్చి నెల వరకు ఎక్కువ సరకు యార్డుకు రావడంతో ధరలు తగ్గడం సాధారణం. అయితే ఇందుకు భిన్నంగా మెరుగైన ధరలతో సీజన్ కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలోనూ ఏ మేరకు పంట మార్కెటుకు వస్తుందో అంచనాలు అందడం లేదు. గత సంవత్సరాల్లో రోజుకు 2లక్షల బస్తాలు వచ్చిన సందర్భాలు చూడగా, ఈ ఏడాది ఒక్కరోజు కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఏటా కంటే శీతల గోదాముల్లో నిల్వచేసే వారి సంఖ్య తగ్గి అందరూ నేరుగా మార్కెట్ కు తీసుకురావడంతో ఊహించిన మేరకు సరకు వచ్చింది. ప్రత్యేక రకమైన బ్యాడిగి రకానికి సీజన్ ఆరంభం నుంచి మంచి ధరలు దక్కుతున్నాయి. క్వింటా రూ.20వేల నుంచి రూ.29వేల వరకు రైతులకు లభించింది.
సాధారణ రకమైన 341 మిర్చికి కూడా ఇదే మాదిరిగా గిరాకీ కొనసాగింది. తేజ రకం ఎప్పుడూ మిగిలిన రకాల కంటే అధిక ధర పలికేది. అయితే ఈ సీజన్లో తేజ రకం ఎగుమతులు ప్రారంభంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిగిలిన రకాలతో పోల్చితే కొంత తగ్గినా క్వింటాకు రూ.24 వేల ధర లభించడం కలిసొచ్చింది. గుంటూరు మిర్చియార్డుకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఎంత సరకు వచ్చినా ధరలు తగ్గకపోగా కొంత పెరుగుతుండటంతో రైతులు అమ్ముకోవడానికే మొగ్గుచూపారు. దీంతో శీతల గోదాముల్లో నిల్వ చేసే సరుకు బాగా తగ్గింది.
ప్రస్తుతం యార్డులో ధరలు ఇలా..
మిర్చియార్డులో ప్రస్తుతం ధరలు ఇలా కొనసాగుతున్నాయి. కామన్ వెరైటీలో 341 రకం మిర్చికి అత్యధిక ధర లభించింది. గత వారంతో పోలిస్తే ఈ రకం మిర్చి గరిష్ఠ ధర పెరిగింది. గతంలో రూ.10,000-24,500 ఉండగా, ఈ వారం రూ.9,500-25,000కు చేరుకుంది. గరిష్ఠ ధర 500 మేరకు పెరిగింది. నెంబర్ 5,273, సూపర్ 10 రకాల మిర్చి ధరలు తగ్గాయి. నెంబర్ 5 రకం ధర గతంలో రూ.11,500-23,500 ఉండగా. ప్రస్తుతం రూ.10,500-22,000 ఉంది. 273 రకం మిర్చి ధర గతంలో రూ. 10,500-22,000 ఉండగా.. ఈ వారం రూ.9,500-21,500 ఉంది.
సూపర్ 10 రకం గతంలో రూ. 18,500-22,000 ఉండగా. ప్రస్తుతం రూ.19,000-19,500 ఉంది. నాణ్యత లేని కారణంగా ఈ రకాల మిర్చి ధరలు కొంత మేరకు తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే 4884 రకానికి రూ.1000 వరకు పెరిగింది. ప్రస్తుతం దీని ధర రూ.21,500 ఉంది. స్పెషల్ వెరైటీల్లో తేజ రకం మిర్చి ధర తగ్గగా, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల ధరలు నిలకడగా ఉన్నాయి. తేజ రకం ధర గతంలో రూ.9,000-24,000 ఉండగా, ప్రస్తుతం రూ. 9,000-23,000 ఉంది. రూ.1000 మేరకు తేజ ధర తగ్గింది. బాడిగ రకం రూ.10,000-27,000, దేవనూరు డీలక్స్ రూ.10,500-23,500 ఉంది. తాలు మిర్చికి రూ. 6,000-13,500 ధర లభించింది.