Monday, November 25, 2024

Big Story: దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ భూములపై ఆరా.. కనిపించని 300 ఎకరాల రికార్డులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: క్షేత్ర స్థాయిలో దిల్ (దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌)​ కు చెందిన 300 ఎకరాల రికార్డులు కనిపించడంలేదని తెలిసింది. భూసర్వేకు వెళ్లిన అధికారులకు ప్రాథమిక స్థాయిలో ఈ 300 ఎకరాలకు చెందిన వివరాలు కనిపించడంలేదని సమాచారం. ఈ అంశాన్ని తాజాగా సీఎం కేసీఆర్‌కు నివేదిక రూపంలో సీసీఎల్‌ఏ అధికారావర్గాలు అందజేశాయని సమాచారం. కాగా కేటాయించిన భూమి ఆక్రమణలకు గురైందని తేలినా కఠిన చర్యలకు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. సదరు ఆక్రమిత భూముల వివరాలు, సర్వే నెంబర్లు రెవెన్యూ రికార్డుల్లో కనిపించడంలేదని భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్‌కు అందిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పన్నేతర రాబడి సమీకరణలో భాగంగా దిల్‌ భూములపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ భూములపై ఉన్న కోర్టు కేసుల్లో సత్వరమే రెవెన్యూ యంత్రాంగం స్పందించి సమగ్ర వివరాలతో నివేదికలను రూపొందిస్తోంది. ఈ భూములను సర్కార్‌ ఖాతాకు చేర్చి వేలం దిశగా యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఆశక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కనిపించకుండా పోయిన భూములివే….

దిల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లో 126 ఎకరాలను దిల్‌కు కేటాయించారు. కాగా ఇప్పటివరకు సర్వే చేసిన అధికారులకు అందులో 66 ఎకరాలు మాత్రమే దొరికింది. రెవెన్యూ రికార్డులు, పొజిషన్‌లో అదే కనిపించింది. కాగా మిగతా 60 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లుగా తేలింది. దీంతో చేసేదిలేక రికార్డుల ప్రకారం గుర్తించిన 66 ఎకరాలకే హద్దులను నిర్ణయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా రెవెన్యూ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విలువైన ప్రాంతంగా పేరున్న రాజేంద్రనగర్‌ మండలంలో కేటాయించిన 41 ఎకరాలకుగానూ 21 ఎకరాలే గుర్తించగలిగారు. సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌లో 197 ఎకరాలూ కనిపించడంలేదని, మొత్తంగా ఆక్రమణదారులు ఖబ్జా చేసుకున్నారనే సమాచారం రెవెన్యూ వర్గాలను కలవరానికి గురిచేసింది. కీసర మండలంలో 10 ఎకరాల్లో ఇంచు భూమి కూడా మిగలలేదని వెల్లడైంది.

ప్రభుత్వానికి చేరిన నివేదిక….

తాజాగా వెల్లడైన విషయాలతో వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ శాఖ మొత్తం వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఈ అంశంలో తదుపరి చర్యలకు మార్గం చూపాలని కోరింది. దీంతో త్వరలో జరగనున్న ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలిసింది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్లాలని కూడా రెవెన్యూ వర్గాలు యోచిస్తున్నాయి. ముందుగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ చట్టాన్ని ప్రయోగించాలని యోచించినా ప్రభుత్వ అనుమతితోనే ముందుకు వెళ్తామని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. న్యాయపరమైన విషయాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

నిరుపయోగ భూముల విక్రయంతో పన్నేతర రాబడిని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో నివేదికలు సిద్దం చేసింది. తాజాగా దిల్‌ (దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌)కు కేటాయించిన భూముల ఫైల్‌ను పరిశీలించింది. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వం కీలక నివేదికలు కోరుతూ అధికారులను అప్రమత్తం చేసింది. ఇందుకు మార్గదర్శకాలతో కూడిన ఫార్మాట్‌తో ఆయా భూముల వివరాలను సేకరించేందుకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బడ్జెట్‌లో పన్నేతర రాబడుల్లో కీలకమైన దిల్‌ భూముల విషయం పేర్కొనడంతో ఇప్పడీ అంశం కీలకంగా మారింది.

అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దిల్‌కు కేటాయించిన విలువైన ప్రభుత్వ భూములు కనిపించడంలేదని రెవెన్యూ శాఖ చెబుతోంది. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి నిమిత్తం 2007లో అప్పటి సీఎం దివంగత వైఎస్‌ నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోని సుమారు 5100 ఎకరాలను దక్కన్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌(దిల్‌)కు కేటాయించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర అవసరాల మేరకు నిరుపయోగంగా ఉన్న సదరు భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా భూములను తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. అవసరానికి అనుగుణంగా కొన్ని భూములను ప్రభుత్వ, ప్రజోపయోగ అవసరాలకు వినియోగిం చే దిశగా ప్రణాళికలను రూపొందించుకుంది. ఇందులో భాగంగా నిర్ధేశిత అవసరాలు, ప్రభుత్వ యోచన సఫలం అయ్యేలా రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 5వేల పైచిలుకు విలువైన భూములను గుర్తించి రాష్ట్ర లాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని భూమి బ్యాంకుకు చేర్చాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement