Wednesday, November 20, 2024

82 వేల కోట్లు రుణ సమీకరణ.. అదానీ గ్రూప్‌ నిర్ణయం

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ వచ్చే సంవత్సరం 82 వేల కోట్ల రూపాయలు(10 బిలియన్‌ డాలర్లు) కొత్త రుణాలు సేకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు, కొత్త ప్రాజెక్ట్‌లకు కావాల్సిన నిధులకు వీటిని ఉపయోగించుకోనున్నట్లు సంబంధిత వర్గాలు ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ఫారెన్‌ కరెన్సీ రుణం, గ్రీన్‌ బాండ్ల ద్వారా కొత్త రుణాలను సమీకరిస్తున్నట్లు తెల్సింది.
కొత్తగా తీసుకునే రుణాల్లో 6 బిలియన్‌ డాలర్లను ఇప్పటికే ఉన్న రుణాలను పనర్‌వ్యవస్థీకరించేందుకు అదానీ గ్రూప్‌ ఉపయోగించుకోనుంది.

దీని వల్ల ఇప్పటికే ఉన్న అధిక వడ్డీ రుణాలన్నీ తీరిపోతాయి. కొత్తగా తీసుకోనున్న రుణాలు తక్కువ వడ్డీకే సమకూర్చుకుంటున్నట్లు తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, అదానీ కంపెనీకి ఉన్న ఆస్తుల విలువను దృష్టిలో పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఆయా సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రుణ సమీకరణలో మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. మరో 4 బిలియన్‌ డాలర్లను కంపెనీ విస్తరణ, కొనుగోళ్లకు ఉపయోగించనున్నారు. అదానీ గ్రూప్‌ ఇప్పటికే కొన్ని కంపెనీల నుంచి ఈక్విటీ పె ట్టుబడుల సమీకరణకు ఒప్పందం చేసుకునంది. దీనికి ఇప్పుడు తీసుకునే 10 బిలియన్‌ డాలర్ల రుణం అదనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement