న్యూఢిల్లి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.80 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని మొదట అంచనా వేసింది. ఇప్పుడు దీనిని 7.30 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల, అంచనాలకు మించి ఎక్కువ కాలం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడమే ప్రధాన కారణమని ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. ద్రవ్యోల్బణం దీర్ఘ కాలం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని తమ నివేదికలో ఎస్ అండ్ పీ వివరించింది. దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. ఇది ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని, ఇది ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.50 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6.90 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక.. భారత్ వృద్ధి రేటు అంచనాల్లో వివిధ అంతర్జాతీయ సంస్థలు కోత పెట్టాయి. ప్రపంచ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 8.70 శాతం నుంచి 8 శాతానికి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 9 శాతం నుంచి 8.20 శాతానికి, ఆర్‌బీఐ 7.80 శాతం నుంచి 7.20 శాతానికి తగ్గించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..