Tuesday, November 26, 2024

Money Matters | రికార్డ్‌ స్థాయిలో క్రెడిట్‌ కార్డ్‌ బకాయిలు

దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు కేవలం ధనికులు మాత్రమే వినియోగించిన క్రెడిట్‌ కార్డులను ఇప్పుడు అన్ని ఆదాయ వర్గాలు వినియోగిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరగడంతో బకాయిలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో క్రెడిట్‌ కార్డుల బకాయిలు కొత్త రికార్డ్‌ నెలకొల్పాయి. బ్యాంక్‌లకు వినియోదారులు చెయాల్సిన చెల్లింపుల మొత్తం మొదటిసారి 2 లక్షల కోట్లు దాటింది. గత సంవత్సరం ఏప్రిల్‌తో పోల్చితే 30 శాతం ఇవి పెరిగాయి.
ఎలాంటి హామీ లేకుండా ఇస్తున్న అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌ పెరగడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు క్రెడిట్‌కార్డుల బకాయిలు కూడా భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ బకాయిల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బ్యాంక్‌లు చెబుతున్నాయి. సాధారణంగా క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో వినియోగదారుడి క్రెడిట్‌ హిస్టరీతో పాటు, ఆ వ్యక్తి ఆర్ధిక స్థోమతను కూడా పరిశీలించిన తరువాతే క్రెడిట్‌ కార్డు జారీ చేస్తుంటామని బ్యాంక్‌లు తెలిపాయి. క్రెడిట్‌ కార్డులు పెరడంతోనే బకాయిలు పెరిగాయని, దీనికి ద్రవ్యోల్బణం కూడా ఒక కారణమని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగినప్పటికీ, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో పెరిగిన సంఖ్య చాలా తక్కువగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కేవలం 5 శాతం మంది దగ్గరే క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని ఆర్బీఐ వివరాలు తెలుపుతున్నాయి. బ్యాంక్‌లు ఇచ్చిన మొత్తం రుణాల్లో క్రెడిట్‌ కార్డుల వాటా 1.4 శాతం మాత్రమే. చాలా తక్కువ కార్డులకే రెండు లక్షలకుపైగా పరిమితి ఉంటుంది. చాలా కార్డులకు 50వేల లోపుగానే క్రెడిట్‌ పరిమితి ఉంటున్నదని బ్యాంకింగ్‌ నిపుణుల చెబుతున్నారు. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల్లో హౌసింగ్‌ రుణాల వాటా 14.1 శబుూతం, వాహన రుణాలు 3.7 శాతం ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి 1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement