కరోనాతో భారత ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి సృష్టించిన నష్టాల నుంచి భారత్ కోలుకోవడానికి మరో 12 ఏండ్లు (2034-35 ఆర్థిక సంవత్సరం) పడుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భవిష్యత్ వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని ధరలను స్థిరీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో కల్లా భారత్‌లో కరోనా మహమ్మారి వల్ల వృద్ధి, జీవన విధానం, జీవితాలపై తీవ్ర ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్నుంచి కోలుకోవడానికి ఏండ్లు పడుతుందని పేర్కొన్నది. 2021-22 ఆర్థిక సంవత్సర కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్సీఎఫ్)ను శుక్రవారం విడుదల చేసింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత రెండేండ్లకు కూడా ప్రీ-కొవిడ్ స్థాయికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోలేదని స్పష్టం చేసింది.
వారసత్వంగా వచ్చిన సంస్థాగత సమస్యల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి విభిన్న సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న ఆశలపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నీళ్లు చల్లిందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రికార్డు స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, అంతర్జాతీయ దవ్య లభ్యత పరిస్థితులు కుదించుకుపోయాయన్నది.