Saturday, November 23, 2024

Tariff increased | వంటనూనెల ధరల మోత…

పండగల సీజన్‌ ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వంటనూనెల దిగుమతులపై భారీగా సుంకం పెంచింది. దీని ఫలితంగా ధరల మంట తప్పదని మార్కెట్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు తగ్గడంతో చౌకగా దిగుమతులు జరుగుతున్నాయి. దీని వల్ల కొంత కాలంగా దేశంలో వంట నూనెల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

చౌకగా దిగుమతులు జరుగుతున్నందున దేశీయంగా నూనె గింజల ధరపడు పడిపోతున్నందున రైతులు నష్టపోతున్నారని, అందుకే దిగుమతులపై సంకాలు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల పండగల సమయంలో రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

పామాయిల్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ముడి నూనెల దిగుమతులపై ఇప్పటి వరకు 5.5 శాతంగా ఉన్న ఉంది. తాజాగా కేంద్రం ముడి నూనెల దిగుమతులపై 20 శాతం సుంకాలు విధించింది. దీంతో పాట అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌, సోషల్‌ వెల్ఫేర్‌ సర్‌ఛార్జ్‌ కలిపితే దిగుమతి సుంకాలు 27.5 శాతానికి చేరుతాయి.

రిఫైన్డ్‌ పామాయిల్‌, సోయా, బీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. అగ్రికల్చర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ సెస్‌లు కలిపి గతంలో ఉన్న 13.75 శాతం ఉన్న పన్నును 35.75 శాతానికి పెరుగుతుంది. సుంకాలు భారీగా పెంచడం మూలంగా దిగుమతులు తగ్గే అవకాశం ఉంది.

ఫలితంగా వంటనూనెల ధరలు గణనీయంగా పెరిగనున్నాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుగున్నందున అక్కడి సోయా రైతుల కోసం ప్రభుత్వం సుంకాలు భారీగా పెంచింది. దేశీయంగా సోయా, ఇతర నూనె గింజల రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

ఈ నిర్ణయం వల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రైతులకు ప్రయోజనం కలుగుతుందని, మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం పడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేలా ఈ చర్యలు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, రాజస్థాన్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం సోయాబీన్‌ ధర క్వింటాల్‌కు 4,600 రూపాయలుగా ఉంది. కేంద్రం నిర్ణయించిన కనీస మద్ధతు ధర 4,892 రూపాయల కంటే ఇది తక్కువ. దేశీయ అవసరాల్లో 70 శాతం వంటనూనెలను మన దేశం దిగుమతి చేసుకుంది. ప్రధానంగా మన దేశం వంటనూనెలను ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్‌ నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.

సోయాబీన్‌, సన్‌ ఫ్లవర్‌ నూనెలు అర్జెంటినా, బ్రెజిల్‌, రష్యా, ఉక్రేయిన్‌ నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశీయంగా వినియోగిస్తున్న వంటనూనెల్లో పామ్‌ అయిల్‌ 50 శాతంగా ఉంది. తాజాగా కేంద్రం సుంకాలు పెంచడం వల్ల వచ్చే వారం నుంచి వీటి ధరలపై ప్రభావం పడుతుందని ఈ నూనెల దిగుమతిదారులు తెలిపారు.

కేంద్రం ఇప్పటికే ఉల్లి, బాస్మతి బియ్యం ఎగుమతులపై కనీస ఎగుమతి ధర నిబంధనను ఎత్తివేసింది. దీని వల్ల మన దేశం నుంచి ఉల్లి, బాస్మతి బియ్యం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇది రైతులకు ముఖ్యంగా మహారాష్ట్ర ఉల్లి రైతులకు ప్రయోజం కలిగిస్తుందని భావిస్తున్నారు.

ఉల్లిపై ఉన్న ఎగుమతి సుంకాన్ని 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. దీని వల్ల దేశం నుంచి ఉల్లి ఎగుమతులు పెరుగుతాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు మాత్రం ఎక్కకువగానే ఉన్నాయి.

రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లి ధరలు కేజీకి 50-60 రూపాయల మధ్య ఉన్నాయి. తాజాగా కేంద్రం ఎగుమతులపై అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు, సుంకాలను కూడా తగ్గించడం వల్ల ఉల్లి ధరలు దేశీయ మార్కెట్‌లో భారీగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పండగల సీజన్‌లో ఇవి మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement