దేశవ్యాప్తంగా 2024లో 5.3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయి కొనుగోలుదారుకు అందించనున్నారు. కోవిడ్ మూలంగా నిర్మాణంలో జాప్యం జరిగిన అనేక ఇళ్లు కూడా పూర్తికానున్నాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్ (స్వామిహ) ఫండ్ సహాయంతో వీటిని పూర్తి చేయనున్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (నరెడ్కో) వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో ప్రధానమైన 7 నగరాల్లో 4.35 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.
2024లో ఇది మరింత పెరగనున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంగ్ సంస్థ అనారక్ డేటా ప్రకారం 2021 కంటే 2022లో ఇళ్ల నిర్మాణం 44 శాతం పెరిగింది. కరోనా సమయంలో ఎదురైన సమస్యలను అధిగమించి తాము 2024లో మూడు ప్రాధానమైన ప్రాజెక్ట్‌ల ద్వారా 40 లక్షల చదరపు అడుగుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గ్రూప్ ప్రకటించింది.
రేరా డెడ్ లైన్ కంటే సంవత్సరం ముందుగానే ఇళ్లను పూర్తి చేసి 1600 కుటుంబాలకు అందించనున్నట్లు కంట్రీ గ్రూప్ డైరెక్టర్ అమిత్ మోడీ తెలిపారు. మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనంత్ రాజ్ ప్రైవేట్ లిమిటెడ్ 20 ఎకరాల టౌన్‌షిప్‌ను ఈ సంవత్సరం పూర్తి చేయనుంది. ఇందులో 700 యూనిట్ల నిర్మాణం జరుగుతోంది. దీంతో పాటు అనంత్ రాజ్, బిర్లా ఎస్టేట్ జాయింట్ వెంచర్‌గా డెవలప్ చేసిన 200 ఇండిపెండెంట్ గృహల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
రియల్ ఎస్టేట్ రంగంలో రేరా, స్వామిహ మూలంగా అనేక మార్పులు జరిగాయి. రేరా ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.23 లక్షల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 1.21 లక్షల వివాదాలను పరిష్కరించారు. 2019 డిసెంబర్‌లో ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకు 26వేల ఇళ్లను ఈ సంస్థ ఫండింగ్‌తో పూర్తి చేశారు. వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ సంస్థ ఫండింగ్‌లో 80 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నిధుల సమస్య మూలంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాజెక్ట్‌లకు ఈ సంస్థ ఫండింగ్ అందిస్తోంది. ఇప్పటి వరకు 35వేల కోట్లకు పైగా ఈ సంస్థ నిధులు సమకూర్చింది.