Sunday, November 17, 2024

ఉద్యోగులకు కోఫోర్జ్‌ బంపర్‌ ఆఫర్‌.. 21వేల మందికి యాపిల్‌ ఐప్యాడ్‌లు

ఐటీ సొల్యూషన్స్‌ కంపెనీ కోఫోర్జ్‌ సంస్థ ఉద్యోగులకు ట్యాబ్‌లను గిఫ్టుగా ఇస్తున్నట్లు పేర్కొంది. క్యు4 ఆదాయంలో కీలక మైలురాయిని అధిగమించిన సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించిన చారిత్రక వేళ, సంస్థలోని మొత్తం 21వేల మందికి యాపిల్‌ ఐపాడ్‌ను బహుమతిగా ఇవ్వనుంది. ఇందుకోసం రూ. 80.3 కోట్లు కేటాయించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి (సేల్స్‌, మార్కెటింగ్‌ సిబ్బంది మినహా) కంపెనీలో మొత్తం 21,815 మంది ఉద్యోగులున్నారు.

- Advertisement -

అత్యుత్తమ పనితీరుతో త్రైమాసికంలో రెండు కీలక విజయాలు సాధించాం. మొదటిది త్రైమాసిక క్రమానుగత 5 శాతం వృద్ధి. రెండోది బిలియన్‌ డాలర్ల మార్క్‌ ఆదాయాన్ని అధిగమించడం అని కోఫోర్జ్‌ సీఈవో సుధీర్‌ సింగ్‌ వెల్లడించారు. 2024లో కూడా ఇదే వృద్ధిని కొనసాగించనున్నామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది రూ.1,742 కోట్లుగాగా ఉన్న కోఫోర్జ్‌ కంపెనీ గ్రాస్‌ రెవెన్యూ మార్చి 31తో ముగిసిన క్యూ4లో 24.5 శాతం పెరిగి రూ.2,170 కోట్లకు చేరింది. అయితే నికర లాభం క్యూ4లో 48.08 శాతం తగ్గి రూ.116.7 కోట్లకు పరిమితమైంది.

గత ఏడాది అది రూ.224.8 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెర్టికల్‌ పై సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కుప్పకూలడం, గ్లోబల్‌ బ్యాంకింక్‌ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపలేదని సంస్థ పేర్కొంది. రానున్న కాలంలో 13 శాతం నుండి 16 శాతానికి వార్షిక ఆదాయ మార్గదర్శకత్వం ఇచ్చింది. అలాగే దాదాపు 50 బేసిస్‌ పాయింట్ల స్థూల మార్జిన్‌ పెరుగుదలను కూడా అంచనా వేసింది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 19 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement