సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్లు సెకన్ల పాటు కనిపించి ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేసినందుకు కోట్లకు కోట్లు ఎందుకిస్తారో అభిమానులకు ఇప్పుడు మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. ప్రమోట్ చేయడమే కాదు వాళ్లు వద్దని చెబితే ఆ బ్రాండ్‌కు ఎంత దెబ్బో కూడా తాజాగా వెల్లడైంది. మొన్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన పని ఇప్పుడు కోకాకోలా కంపెనీని భారీగానే దెబ్బ తీసింది. యూరోకప్‌లో హంగరీతో మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో తన ముందున్న కోలా బాటిళ్లను తీసి పక్కన పెట్టిన రొనాల్డో.. వాటి కంటే నీళ్లు తాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాడు.
అతడు ఇచ్చిన ఈ సందేశం కోకాకోలా కంపెనీకి భారీ నష్టం తీసుకొచ్చింది. డైలీ స్టార్ అనే పత్రిక కథనం ప్రకారం.. ఈ ఘటన తర్వాత కోకాకోలా కంపెనీ విలువ 1.6 శాతం పడిపోయింది. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ విలువ దెబ్బకు 238 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే 400 కోట్ల డాలర్లు (సుమారు రూ.30 వేల కోట్లు) నష్టపోయింది. ప్రపంచంలోని మేటి అథ్లెట్లలో ఒకడైన రొనాల్డో.. ఇలాంటి సాఫ్ట్‌డ్రింక్స్‌ను ప్రోత్సహించడు. జంక్ ఫుడ్‌కు కూడా దూరంగా ఉంటాడు. అయితే దానిని పబ్లిగ్గా, కోట్ల మంది చూసే ప్రెస్‌మీట్‌లో వ్యక్తపరచడంతో కోకాకోలా కంపెనీకి నష్టాన్ని తీసుకొచ్చింది.