ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ క్రిటికల్ మినరల్స్ మైనింగ్‌లోకి ప్రవేశించాలని భావిస్తోంది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ కోసం ప్రభుత్వం త్వరలోనే బ్లాక్‌ల వారీగా వేలం నిర్వహించనుంది. ప్రభుత్వం నుంచి కొన్ని బ్లాక్‌లను తీసుకుని ఈ రంగంలోకి ప్రవేశించాలని కోల్ ఇండియా నిర్ణయించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా లిథియం మైనింగ్‌లోకి ప్రవేశించాలని కంపనీ నిర్ణయించింది.
ఇంధన రంగంలో లిథియం కీలక పాత్ర పోషించనుంది. మన దేశం 2070 నాటికి నెట్‌జీరో టార్గెట్‌లో లిథియం ప్రధాన పాత్ర పోషించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీలో లిథియం ఆయాన్ కీలకం. ప్రభుత్వం నుంచి తమకు లిథియం బ్లాక్ కేటాయించిన తరువాత మైనింగ్ ప్రారంభిస్తామని కోల్ ఇండియా టెక్నికల్ డైరెక్టర్ బీ. వీరారెడ్డి తెలిపారు. ఆయన సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. కోల్ ఇండియాకు మైనింగ్ విషయంలో అపారమైన అనుభవం, సాంకేతికత ఉందని, అనుమతి వచ్చిన తరువాత దీన్ని లిథియం మైనింగ్ తవ్వకాలకు వినియోగిస్తామని ఆయన చెప్పారు.
లిథియం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వినియోగించడంతో పాటు, మెడికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, మొబైల్ ఫోన్ బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్స్, రెన్యూవబుల్ టెక్నాలజీస్‌లోనూ వినియోగిస్తారు. 45,000 కోట్ల విలువైన క్రిటికల్ మినరల్స్ గనులను వేలం వేస్తామని గనులు, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గత సంవత్సరం ప్రకటించారు. ఇందులో రెండు బ్లాక్‌లు లిథియం గనుల కోసం కేటాంచనున్నట్లు తెలిపారు. మన దేశంలో లిథియం జమ్ము అండ్ కాశ్మీర్, చత్తీష్‌గఢ్, రాజస్థాన్‌లలో ఉన్నాయి.