Monday, November 18, 2024

చిత్ర, ఆనంద్‌.. ఓ హిమాలయ యోగి.. ఆనందే యోగీ అవతారం.. సీబీఐ విచారణలో వెల్లడి

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) ఆనంద్‌ సుబ్రమణియన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 2018 నాటి మార్కెట్‌ మాణిప్యులేషన్‌ కేసులో చెన్నైలో ఆనంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అక్కడి నుంచి ఢిల్లిdకి తరలించారు. ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ ఓ యోగీ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ అదృశ్య యోగీ ఎవరనే దానిపై అనేక వార్తలు వినిపించాయి. అయితే అందరూ ఊహించినట్టే.. ఆ హిమాలయ యోగి.. ఎన్‌ఎస్‌ఈ మాజీ అధికారి ఆనంద్‌ సుబ్రమణియన్‌ అని తాజాగా తెలిసింది. ఇతడే, చిత్రా రామకృష్ణతో ఈ-మెయిళ్ల ద్వారా నిరాకార వ్యక్తిగా సంభాషణలు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆనందే యోగి అనే విషయం దాదాపు ఖరారైనట్టు సమాచారం.

చాటింగ్‌ వివరాల సేకరణ
చిత్రతో చాటింగ్‌కు ఉపయోగించిన ఈ-మెయిల్‌ ఐడీని ఆనందే తెరిచినట్టు సాక్ష్యాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఈ-మెయిల్‌ ఐడీకి చిత్ర పంపిన కొన్ని మెయిళ్లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు ఆనంద్‌ వ్యక్తిగత ఈ-మెయిల్‌లో ఉన్నటటు సీబీఐ తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ లొకేషన్‌ కుంభకోణంలోనూ ఆనంద్‌, చిత్రపై కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో ఆనంద్‌ సహకరించడం లేదని సమాచారం. తన మెయిల్‌ ఐడీ వివరాలు చెప్పమంటే.. మర్చిపోయానని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తున్నది. 2013, ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఆనంద్‌ చీఫ్‌ స్ట్రాటజిక్‌ ఆఫీసర్‌గా ఉన్నాడు. ఆ తరువాత ఆయన్ను గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా చిత్రా నియమించారు. ఆ తరువాత ఎండీ సలహాదారుగా నియమించారు. ఇదంతా ఓ యోగి సూచన మేరకు చేసినట్టు సెబీ దర్యాప్తులో తేలింది. ఆ యోగీ ఆనందే అనే అనుమానాలు ఉన్నాయి.

ఆనంద్‌కు కీలక సమాచారం
ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన ఆర్థిక వ్యాపార ప్రణాళికలతో పాటు డివిడెంట్‌, ఆర్థిక ఫలితాల వంటి అంతర్గత సమాచారాన్ని చిత్రా రామకృష్ణ సదరు యోగితో పంచుకున్నారని, ఆ యోగే ఆనంద్‌ సుబ్రమణియన్‌ అని సీబీఐ చెబుతున్నది. ఆనంద్‌ సుబ్రమణియన్‌ పదోన్నతులపై పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులోనే ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్ర రామకృష్ణకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. హిమాలయాల్లో ఉండే ఓ ఆధ్యాత్మిక యోగి.. చిత్రపై ప్రభావం చూపించారని, ఆమెను పావులా ఉపయోగించుకుని ఎన్‌ఎస్‌ఈని ఆ యోగి నడిపించారని సెబీ గుర్తించింది. ఆ యోగి ప్రభావం కారణంగానే.. ఎలాంటి క్యాపిటల్‌ మార్కెట్‌ అనుభవం లేదని వ్యక్తిని ఎన్‌ఎస్‌ఈ సీఓఓ, ఎండీ సలహాదారుగా నియమించారని సెబీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement