Saturday, November 23, 2024

Open AI | చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్‌ ఆల్ట్‌మెన్‌ వేటు… ఏపెన్‌ఏఐ సహా వ్యవస్థాపకుడి రాజీనామా

సాంకేతిక రంగంలో పెను సంచలనం సృష్టించిన కృత్రిమ మేథ ఆధారిత చాట్‌జీపీటీని రూపొందించిన సామ్‌ అల్ట్‌మెన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి ఓపెన్‌ఏఐ సంస్థ తొలగించింది. మైక్రోసాఫ్ట్‌ ఆర్ధిక మద్దతు ఉన్న ఓపెన్‌ఏఐ ఆయన్ని విశ్వసించకపోవడం వల్లే వేటు పడిందని భావిస్తున్నారు. ఆయన స్థానంలో సంస్థ తాత్కాలికంగా కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న మిరా మురాటీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటారని ఓపెన్‌ఏఐ తెలిపింది.

ఆల్ట్‌మెన్‌ తొలగింపు టెక్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డు శుక్రవారం నాడు సమావేశమై ఆయన్ని తొలగించాలన్న నిర్ణయం తీసుకుంది. ఆల్ట్‌మెన్‌ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయితీ పాటించడంలేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నారని బోర్డు పేర్కొంది. అతనికి ఓపెన్‌ఐకి నాయకత్వం వహించే సమర్ధతపై నమ్మకం పోయిందని పేర్కొంది.

- Advertisement -

తనను తొలగించడంపై ఆల్ట్‌మెన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఓపెన్‌ ఏఐ సంస్థలో పని చేయడాన్ని ఎంతో ఇష్టపడ్డానని, వ్యక్తిగతంగా తాను మారేందుకు ఉపయోగపడిందని, ప్రపంచం కొంచెం మారిందనడాన్ని తాను విశ్వసిస్తున్నాని పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తాను ఎంతో మంది ప్రతిభావంతులైన వారితో పని చేయడాన్ని ఇష్టపడ్డానని తెలిపారు.

ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడి రాజీనామా…

సామ్‌ ఆల్టమన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించిన కొద్ద సేపట్లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ తన పదవికి రాజీనామా చేశారు. సామ్‌ ఆల్టమెన్‌ను తొలగించిన కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో ప్రకటించారు. గత 8 సంవత్సరాలుగా తాము అంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల గర్వంగా ఉన్నామని, ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్నామని, గొప్ప క్షణాలను ఆస్వాదించామని పేర్కొన్నారు.

జరిగిన పరిణామంతో కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ చాట్‌బోట్‌ సహాయంతో కేవలం సెకన్లలోనే తమకు కావాల్సిన కచ్చితమైన సమాచారన్ని పొందవచ్చు. చాట్‌జీపీటీ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయని చాలా మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.

దీని వల్ల వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయో ప్రమాదం ఉందన్న ఆందోళనతో దీన్ని సృష్టించిన సామ్‌ ఆల్ట్‌మెన్‌ కూడా ఏకీభించారు. చాట్‌జీపీటీ కంటే పవర్‌పుల్‌ ఏఐని డెవలప్‌ చేసే సత్తా ఓపెన్‌ఏఐకి ఉందని, దాన్ని వెంటనే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని ఆల్ట్‌మెన్‌ స్పష్టం చేశారు. దీని వల్ల వచ్చే పరిణామాలను ఊహించడం కూడా కష్టమన్నారు.

కొత్త సీఈఓ మిరా మూరాటి

ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకున్న మిరా మారాటి లీడర్‌షిప్‌ టీమ్‌లో ఐదేళ్లుగా సభ్యురాలిగా ఉన్నారు. ఓపెన్‌ఏఐ గ్లోబల్‌ ఏ1 లీడర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీ ప్రకారం ఆమెకు ప్రత్యేక నైపుణ్యం, కంపెనీ విలువలు, కార్యకలపాలు, వ్యాపారంపై మంచి అవగాహన ఉంది. ఇప్పటికే ఆమె కంపెనీ ఆర్‌ అండ్‌ డీ, ఉత్పత్తి, భద్రతా విధులను నాయకత్వం వహిస్తున్నారని ఓపెన్‌ఏఐ తెలిపింది.

నాన్‌ ప్రాఫిట్‌ సంస్థగా ప్రారంభమై…

ఓపెన్‌ఏఐని 2015లో ప్రారంభించినప్పుడు లాభాపేక్షలేని సంస్థగా దీన్ని నడిపించాలని వ్యవస్థాపకులు భావించారు. ఆల్టమన్‌తో పాటు సుత్‌ స్కేవర్‌, ఎలాన్‌ మస్క్‌ వంటి పలువురు వ్యవస్థాపకులుగా ఉన్నారు. ప్రంపచానికి సురక్షితమై, బాధ్యతాయుతమైన ఏఐని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో ఆల్టమన్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న తరువాత పరిస్థితి మారింది. దీన్ని పెద్ద కంపెనీగా మార్చాలని భావించారు.

ఇందు కోసం మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీల నుంచి భారీగా నిధులు సమీకరించారు. కంపెనీ లక్ష్యానికి విరుద్ధంగా ఏఐ ని లాభసాటి బిజినెస్‌గా మార్చాలని ఆల్ట్‌మన్‌ భావించారు. దీంతో బోర్డుకు ఆయనకు మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. ఏఐ వల్ల ఏర్పడే ప్రమాదకర పరిస్థితులను పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు వెళ్లడంతో విమర్శలు పెరిగాయి. చాట్‌జీపీటీ, ఇతర సర్వీస్‌లకు సంబంధించిన భద్రతను పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్లాడని సిలికాన్‌ వ్యాలీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇటీవల సొంత జీపీటీలను డెవలప్‌ చేసుకునేలా కొన్ని ప్లగ్‌ ఇన్‌లను చాట్‌జీపీటీలో ఓపెన్‌ఏఐ తీసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా వెబ్‌సౖౖెట్‌కు యూజర్లు పోటెత్తడంతో కొన్ని గంటల పాటు చాట్‌జీపీటీ నిలిచిపోయింది. దీంతో ప్లగ్‌ ఇన్స్‌కు సైనప్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆల్టమన్‌ ట్విట్‌ చేయాల్సి వచ్చింది. ఇది కూడా ఆయన తొలగింపుకు ఒక కారణమని భావిస్తున్నారు. ఓపెన్‌ ఏఐ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన కంపెనీ చీఫ్‌ సైంటిస్ట్‌ సుత్‌స్కేవర్‌కు, ఆట్టమన్‌ మధ్య విభేదాలు కూడా ఆయన ఉద్వాసనకు కారణమని భావిస్తున్నారు. భద్రత, కమర్షిలైజ్‌ చేసే విషయంలో వీరి మధ్య విభేదాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement