దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతను నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మధ్యప్రదేశ్, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్, ఏపి, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా తగిన నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతున్నా పరిస్థితి దారికి రావడంలేదు. దీంతో కేంద్రం యూనివర్శిల్ సర్వీస్ అబ్లిగేషన్ (యూఎస్‌వో) పరిధిని విస్తరించింది. చమురు విక్రయాలు గిట్టుబాటు కావడంలేదని ప్రయివేట్ సంస్థలు బంక్‌ల్లో తగిన నిల్వలు ఉంచడంలేదు. ఇలాంటి వాటిలోనే ఎక్కువగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ బంక్‌ల్లో రద్దీ పెరిగింది. స్టాక్ త్వరగా అయిపోతోంది. దీని వల్ల కొన్ని చోట్ల ప్రభుత్వ రంగ సంస్థల బంక్‌ల్లోనూ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.
యూఎస్‌ఓ పరిధిని పెంచడంతో లైసెన్స్ పొందిన అన్ని సంస్థలు గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని ఏరియాల్లో నిర్ధేశించిన సమయాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు చేయాల్సి ఉంటుంది. నింబధనలు పాటించకుంటే లైసెన్స్‌లు రద్దు చేస్తామని చమురు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నా, ఇటీవల కొంత కాలంగా రోజువారి రేట్లను సవరించడంలేదు. రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలింగా ప్రభుత్వ రంగంలోని ఐఓసి, బీపీసిఎల్, హెచ్‌పిసీఎల్ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ను 15 నుంచి 25 రూపాయలకు తక్కువకే విక్రయిస్తున్నాయి. ప్రయివేట్ సంస్థలు ఈ రేటు గిట్టుబాటు కాదన్న ఉద్దేశ్యంతో నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యూఎస్‌వో పరిధిని విస్తరించింది.
ఈ ఆదేశాల ప్రకారం ప్రయివేట్ రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ విక్రయాలను నిలిపివేయడానికి వీలులేదు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో బంక్‌లకు ఇది వర్తించేది కాదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.