యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందిస్తున్న ఉబర్, ఓలా సంస్థలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ రెండు సంస్థలకు నోటీస్‌లు జారీ చేసింది. ఈ తరహా యాప్‌లు ఫోన్ ధరను బట్టి, అండ్రాయిడ్, ఐఓఎస్ ను బట్టి ధరల్లో తేడా ఉంటోందని చాలా కాలంగా వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీనిపై వివరణ కోరుతూ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఈ సంస్థలకు నోటీస్ ఇచ్చింది. కేంద్ర వినియోగదారుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఎక్స్‌తో అండ్రాయిడ్, ఐఫోన్‌ల ద్వారా ఈ క్యాబ్‌లు వేస్తున్న ఛార్జీల్లో తేడాలను తెలిపే పోస్ట్ ను పంచుకున్నారు.
దీంతో పాటు ఒకే సర్వీస్‌కు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కూడా సీసీపీఏ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఒకే సర్వీస్‌కు రెండు వేర్వేరు రేట్లు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని కోరింది.
రేట్లలో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సీసీఏఐ పేర్కొంది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకు వచ్చేందుకు సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వినియోగదారులను దోపిడీ చేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీసీపీఏను మంత్రి ఆదేశించారు.