ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీని రైట్స్ ఇష్యూ జారీ చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రం కోరింది. మరో ప్రభుత్వ ఆయిల్ కంపెనీ హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ (హెచ్‌పీసీఎల్) గ్రీన్ ప్రాజెక్ట్ కోసం నిధులు సమకూర్చేందుకు రైట్స్ ఇష్యూ జారీ చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రం కోరింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల కోసం 1.9 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాలని హెచ్‌పీసీఎల్ నిర్ణయించింది.
ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం 30,000 కోట్లు సమకూర్చాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే కేంద్రం ఓఎన్‌జీసీనీ రైట్స్ జారీ చేయాలని కోరింది. దీంతో పాఉ హెచ్‌పీసీఎల్‌కు నేరుగా ప్రిఫరెన్షియల్ రెట్లలో రుణాలను అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఓఎన్‌జీసీ రైట్స్ ఇష్యూ విషయంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పందన కోసం చమురు మంత్రిత్వ శాఖ ఎదురు చూస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఓఎన్‌జీసీ రైట్స్ ఇష్యూ జారీ చేస్తే మొత్తం 15,500 కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉంది. 2018లో కేంద్ర ప్రభుత్వం తనకు హెచ్‌పీసీఎల్ ఉన్న మొత్తం వాటా 51.1 శాతాన్ని ఓఎన్‌జీసీకి విక్రయించింది. దీంతో ఈ చమురు సంస్థ ఓఎన్‌జీసీకి అనుబంధంగా మారింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్‌జీసీలో 58.93 శాతం వాటా ఉంది.
ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించడం ద్వారా హెచ్‌పీసీఎల్‌కు నిధులు సమకూర్చాలని ప్రభుత్వం ముందు భావించింది. ఇలా చేస్తే ఓఎన్‌జీసీలో ప్రభుత్వానికి ఉన్న వాటా 50 శాతం కంటే తగ్గుతుంది. దీని వల్ల హెచ్‌పీసీఎల్‌పై ప్రభుత్వ పరోక్ష నియంత్రణను కోల్పోతుంది. మరో రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పికే రైట్స్ ఇష్యూ జారీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ 22 వేల కోట్లకు, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ 18 వేల కోట్లకు రైట్స్ ఇష్యూను జారీ చేయనున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి ఐఓసీలో 51.5 శాతం, బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాలు కలిగి ఉంది. ఈ రెండు సంస్థల రైట్స్ ఇష్యూలను అక్టోబర్‌లోనే జారీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో జాప్యం జరుగుతోంది.
హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ కలిసి 2040 నాటికి గ్రీన్ ఎనర్జీ పై 3.5 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి.