చైనాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ బిల్డ్ యూవర్ డ్రీమ్స్ (బీవైడీ) దేశంలో ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. బీవైడీ కంపెనీలో వార్న్ బఫెట్ పెట్టుబడులు పెట్టారు. అటో 3 పేరుతో కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మంగళవారం నాడు మార్కెట్లో విడుదల చేసింది. బీవైడీ ప్రపంచంలో విద్యుత్ కార్ల తయారీలో నాలుగో అతి పెద్ద కంపెనీగా ఉంది. చైనాలో అగ్రస్థానంలో ఉంది. బీవైడీ కంపెనీ ఇప్పటికే ఇ-6 పేరుతో విద్యుత్ కారును మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది ప్రధానంగా కార్పోరేట్ మొబిలిటీ కోసం ఉద్ధేశించారు. దీనితో పాటు దేశంలో బీవైడీ కంపెనీ విద్యుత్ బస్సులను, ఇతర ఈవీ వాహనాలను, బ్యాటరీలను, ఛార్జింగ్ యూనిట్లను విక్రయిస్తోంది.
కంపెనీ 2030 నాటికి ఇండియా ఈవీ కార్ల మార్కెట్లో 40 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. విద్యుత్ బస్సుల విషయంలో కంపెనీ చాలా దేశాల్లో 70 శాతం వరకు మార్కెట్ వాటా కలిగి ఉందన్నారు. కంపెనీ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టనుందని చెప్పారు. బీవైడీ కంపెనీ ఇప్పటికే నార్వే, న్యూజిల్యాండ్, సింగపూర్, బ్రెజిల్, కోస్టారికా, కొలంబియా దేశాల్లోనూ ఈవీ వాహనాలను, ఛార్జింగ్ యూనిట్లను విక్రయిస్తోంది. 2023 నుంచి కంపెనీ జపాన్‌లోనూ ఈవీ కార్లను విక్రయించనుంది. చెన్నయ్ సమీపంలో కంపెనీకి అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఉంది. ఇక్కడి నుంచే ఇ-6తో పాటు, కొత్తగా మార్కెట్లో లాంచ్ చేసిన అటో3ని కూడా తయారు చేయనుంది. థాయిల్యాండ్లోనూ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బీవైడీ వెల్లడించింది.
ఇండియా, అమెరికా, బ్రెజిల్ మార్కెట్ల కోసం సంవత్సరానికి 1,50.000 ఈవీ కార్లను 2024 నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. అటో3ని కంపెనీ సోమవారం నాడు థాయిల్యాండ్లోనూ విడుదల చేసింది. చైనాలోని షెన్జెన్ కేంద్రంగా పని చేస్తున్న బీవైడీ కంపెనీ 2007లోనే మన దేశంలో కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రారంభంలో మొబైల్ బ్యాటరీలు, కంపోనెట్స్‌ను తయారు చేసిన కంపెనీ క్రమంగా ఈవీ వాహనాల తయారీలోకి ప్రవేశించింది. 2013లో కంపెకనీ స్థానిక ఇండియన్ భాగస్వామితో కలిసి విద్యుత్ బస్సులను తయారు చేస్తోంది. 2021లో ఇ6 ఈవీ కారును విడుదల చేసింది. చెన్నయ్ యూనిట్ నుంచి సంవత్సరానికి 10 వేల కార్లను ఉత్పత్తి చేయగలదు.