Friday, November 22, 2024

బుల్‌ రంకెలు, భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 60వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి.. ఎగుమతుల్లో భారీ వృద్ధి.. జాతీయంగా, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు.. వెరసి.. భారత్‌ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రంకెలు వేసింది. దీనికితోడు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం భారీ లాభాలకు కారణమైంది. సెన్సెక్స్‌ 60వేల మార్క్‌ను, నిఫ్టీ 18వేల మార్క్‌ను దాటేసింది. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 59,764.13 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,845.10 పాయింట్ల గరిష్టానికి.. 59,760.22 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. చివరికి 1335.05 (2.25 శాతం) పాయింట్ల లాభంతో 60,611.74 పాయింట్ల వద్ద ముగిసింది. 17,809.10 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 18,114.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 382.9 పాయింట్లు (2.17 శాతం) ఎగబాకి.. 18,053 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.75.50 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.


దన్నుగా నిలిచిన బ్యాంకింగ్‌
బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్ల ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉండటంతో భారతీయ ఈక్విటీ బెంచ్‌ మార్క్‌లు భారీ లాభాలను గడించాయి. ఇక ప్రైవేటు సంస్థలు అయిన హెచ్‌డీఎఫ్‌సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీన ప్రణాళికను ప్రకటించిన తరువాత.. దేశీయ సూచీలు రెండున్నర నెలల కంటే ఎక్కువ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ విలీన వార్తలు రావడంతో మార్కెట్‌ ప్రారంభంలో ఒక గంటలోనే.. ఇన్వెస్టర్లు రూ.3లక్షల కోట్ల లాభాలను వెనుకేసుకున్నారు. నిఫ్టీలో 15 సెక్టార్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనం కానున్నాయన్న ప్రకటన.. సూచీల సెంటిమెంట్‌ను పెంచింది. ఈ రెండు స్టాక్‌లు దాదాపు 12 శాతంపైగా లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ 50లో ప్రధాన వాటా కలిగిన హెచ్‌డీఎఫ్‌్‌సీ బ్యాంకు డిపాజిట్లు 20 శాతం మేర పెరగడం కూడా సూచీల్లో ఉత్సాహం నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement