స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం, దిగ్గజ కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. సూచీలు 2 శాతం లాభపడ్డాయి. ఈ నెల మొత్తం బుల్లిష్ సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్, ట్రెజరీ బాండ్ల వడ్డీలు తగ్గుతుండటం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. పరిస్థితి ఇలానే ఉంటే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు తిరిగి మన దేశ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆసియా-పసిఫిక్ సూచీలు రాణించడం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమైంది. సంపన్నులకు కల్పించిన పన్ను రాయితీల విషయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి వెనక్కి తగ్గడం కూడా అనుకూలించింది.
సెన్సెక్స్ 1276.66 పాయింట్లు లాభపడి 58065.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 386.95 పాయింట్ల లాభంతో 17274.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 835 రూపాయలు పెరిగి 51000 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 548 రూపాయలు పెరిగి 61459 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.62 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు
ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్టులు, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, టీసీఎస్, హెచ్‌డిఎఫ్‌సీ, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, విప్రో, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్,భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ షేర్లు నష్టపోయాయి.