2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ఆర్థికశాఖ కసరత్తును ప్రారంభించాడానికి సిద్ధమైంది. అక్టోబర్ 10 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అపెండిసిస్ 1-7లో కచ్చితంగా పొందుపరచాల్సిన వివరాలను ఆర్థిక సలహాదారులు నిర్ధిష్ట విధానంలో నమోదు చేయాల్సి ఉంటుంది. డేటా హార్డ్ కాపీస్‌తోపాటు, పునపరిశీలన కోసం నిర్దేశిత ఫార్మాటల్లోనూ సమర్పించాలని ఆర్థికశాఖ ప్రకటన కోరింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టబోయే ఈ వార్షికబడ్జెట్ నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి చిట్టచివరి పద్దు కానుంది.
అన్ని విభాగాలకు అవసరమైన నిధులతోపాటు, ఆయాశాఖలకు సంబంధించిన రాబడి వ్యయాలను ప్రి బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తారు. వివిధ దశల్లో సాగే సంప్రదింపుల తర్వాత, 2023 జనవరి10న ఆర్థికశాఖ తుదిరూపు ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, అధిక ద్రవ్యోల్బణం, డిమాండ్ పెంపు, ఉపాధి కల్పన, 8శాతం వృద్ధిరేటు వంటి కీలక సవాళ్లు కేంద్ర ప్రభుత్వం ముందున్నాయి.