Friday, November 22, 2024

బీఎస్‌ఎన్‌ఎల్‌ -బీబీఎన్‌ఎల్‌ విలీనం.. ఈ నెల్లోనే ప్రక్రియ పూర్తి

ప్రభుత్వ రంగ సంస్థ విలీనాల ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌)ను ప్రభుత్వరంగ మరో టెలికాం సంస్థ అయిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)లో విలీనం చేయాలని భావిస్తున్నది. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ మాట్లాడుతూ.. బీబీఎన్‌ఎల్‌ విలీన ప్రక్రియతో బీఎస్‌ఎన్‌ఎల్‌ను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఈ విలీనం బీఎస్‌ఎన్‌ఎల్‌ బలోపేతానికి ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ఈ విలీనంతో.. బీబీఎన్‌ఎల్‌ పూర్తి బాధ్యతలు బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిధిలోకి వస్తాయన్నారు.

6.8లక్షల కి.మీ ఆప్టికల్‌ ఫైబర్‌..

ఈ విలీన ప్రక్రియను ఈనెలలో పూర్తి చేయాలని భావిస్తున్నామని పీకే పుర్వార్‌ స్పష్టం చేశారు. ఆలిండియా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్స్‌ అండ్‌ టెలికాం ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీలు సెల్‌ఫోన్‌ సేవలతో పాటు బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు అందిస్తున్నాయని, ఈ కంపెనీలకు ధీటుగా సేవలు అందిస్తామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే 6.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. 2021 జులైలో దేశ వ్యాప్తంగా 6లక్షల గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించేందుకు భారత్‌నెట్‌ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ బాధ్యతలు బీబీఎన్‌ఎల్‌ చూసుకునేది. అందుకోసం సుమారు రూ.24వేల కోట్లను వెచ్చించారు. దేశంలోని 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో 1.71 లక్షల జీపీలను భారత్‌ నెట్‌ ప్రాజెక్టు కింద అనుసంధానం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement