బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ నాటికి మరిన్ని ప్రాంతాల్లో 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామాల్లోనూ 4జీ సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కాకుండా, ఇప్పటికే ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 4G సిమ్ కార్డ్లకు అప్గ్రేడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీంతోపాటు 5జీ సిమ్ కార్డులను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ఈ 5G సిమ్ కార్డ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి. 4జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలంలోనే 5జీ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. 5G సిమ్ కార్డ్లు ఉన్న వినియోగదారులు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దాన్ని ఉపయోగించవచ్చు
ఇక ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా గత నెలలో మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతో తక్కువ ధరలో సర్వీసులు అందించడం సహా త్వరలో 4G సేవలు ప్రారంభం కానుండడంతో అనేక మంది వినియోగదారుల చూపు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది. ఫలితంగా లక్షల మంది మొబైల్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు పోర్టింగ్ అవుతున్నారు. జులై నెలలోనే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 2.31 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నారని సంస్థ వెల్లడించింది.