న్యూఢిల్లి : దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస నష్టాలకు గురువారం బ్రేక్ పడింది. బీఎస్ఈ ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ స్టాకులు రాణించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. డెరివేటివ్స్ వీక్లి గడువు ప్రభావంతో రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ చివరకు సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 57,901 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ50 సూచీ 17,195 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈపై 12 రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మీడియా సూచీ దాదాపు 2 శాతం క్షీణించింది.
నిఫ్టీ ఫార్మా, ప్రైవేటు బ్యాంక్, రియల్టి, హెల్త్‌కేర్, ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సూచీలు 0.5-08 శాతం మధ్య దిగజారాయి. మరోవైపు ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీలు లాభాలతో ముగిశాయి. మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.69 శబుూతం క్షీణించగా.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.83 శాతం మేర నష్టపోయింది. నిఫ్టీపై హిందాల్కో 2 శాతం క్షీణించి టాప్ నష్టదారుగా నిలిచింది. ఆ తర్వాత సిప్లా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 0.6 -1.5 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బారత్ పెట్రోలియం, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిఫ్టీపై టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మొత్తంగా సెన్సెక్స్‌పై 1843 షేర్లు ప్రతికూలంగా ముగియగా.. 1508 షేర్లు సానుకూలంగా ముగిశాయి.