భారతదేశంలోని టాప్ 7 సిటీస్‌లో రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ రెంట్లు భారీగా పెరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో పలుకుతున్న ధరలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా వచ్చిన ANAROCK రీసెర్చ్ డేటా.. రెంట్‌లలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సూచిస్తోంది. ఈ విషయంలో కొన్ని నగరాలు చాలా ముందంజలో ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం 2023 మొదటి తొమ్మిది నెలల్లో బెంగుళూరులోని కీలక ప్రాంతాల్లో రెసిడెన్షియల్ రెంట్‌లు 30% పెరిగినట్టు తెలుస్తోంది.
ప్రత్యేకించి వైట్‌ఫీల్డ్‌లో దాదాపు 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక స్టాండర్డ్ 2BHK ఫ్లాట్ అద్దెలో 31% పెరుగుదల కనిపించింది. సర్జాపూర్ రోడ్డులో ఇలాంటి ఇళ్ల అద్దెలు 27% పెరిగాయి. వైట్‌ఫీల్డ్‌లోని స్టాండర్డ్ 2BHK ఇంటి సగటు నెలవారీ అద్దె 2022 డిసెంబర్‌లో రూ.24,600గా ఉంది. 2023 సెప్టెంబర్ నాటికి రూ.28,500కి పెరిగింది. అదే సమయంలో సర్జాపూర్ రోడ్‌లో అద్దెలు రూ.24,000 నుంచి రూ.30,500కి పెరిగాయి.
ఇక ఈ లిస్ట్ లో బెంగళూరు తర్వాత ప్రఖ్యాత IT/ITeS హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, పూణే నగరాల్లో రెసిడెన్షియల్ రెంట్‌లు ఎక్కువగా పెరిగాయి. 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో సగటు అద్దెలు 16%, గచ్చిబౌలి ప్రాంతంలో 24% పెరుగుదల నమోదు చేశాయి. అదే సమయంలో పూణేలోని హింజేవాడి మైక్రో-మార్కెట్‌లో 17% అద్దెలు పెరిగాయి.
అదే విధంగా చెన్నైలోని పల్లవరం, పెరంబూర్ రెంటల్ వ్యాల్యూలు వరుసగా 12%, 9% పెరిగాయి. NCR పరిధిలోని గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్ (11% వృద్ధి), నోయిడాలోని సెక్టార్-150 (13% వృద్ధి), ఢిల్లీలోని ద్వారక (14% వృద్ధి)తో ముందంజలో ఉన్నాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ ప్రాంతంలోని చెంబూర్, ములుండ్ రెంటల్ వ్యాల్యూలు వరుసగా 14%, 9% పెరిగాయి. కోల్‌కతాలోని EM బైపాస్, రాజర్‌హట్ రెంటల్ వ్యాల్యూ వరుసగా 14%, 9% వృద్ధితో ప్రత్యేకంగా నిలిచాయి.