ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్ల భయాలు స్టాక్‌మార్కెట్లను వెంటాడుతున్నాయి. అమెరికా ఫెడ్ రేట్లు 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికాతో పాటు అనేక దేశాల మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఆర్ధిక మాంద్యం తప్పదన్న సంకేతాలు మార్కెట్లను కలవరానికి గురి చేస్తున్నాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్లు పెంచుతూ, రానున్న రోజుల్లో మరింత కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. ఆర్ధిక మాంద్యం వచ్చే సూచనలు ఉన్నాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అమెరికాతో పాటు, బ్రిటన్, స్విట్జర్లాండ్ కూడా వడ్డీరేట్లు పెంచింది. త్వరలోనే మన దేశంలో ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచనుంది. ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మన దేశీయ మార్కెట్లు ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 1020.80 పాయింట్లు నష్టపోయి 58098.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 302.45 పాయింట్లు నష్టపోయి 17327.35 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 586 రూపాయలు తగ్గి 49414 రూపాయల వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 1511 రూపాయలు తగ్గి 56516 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 80.87 రూపాయిలుగా ఉంది.
లాభపడిన షేర్లు..
సన్ ఫార్మా ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐటీసీ, దీవిస్ ల్యాబ్, సిప్లా, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు..
ఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకీ, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.
ఇన్వెస్టర్ల సంపద 4.83 లక్షల కోట్లు ఆవిరి
శుక్రవారం నాడు స్టాక్‌మార్కెట్లు భారీగా పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద 4.83 లక్షల కోట్లు అవిరైంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌సీలో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ 2 నుంచి 2.3 శాతం నష్టపోయాయి. మొత్తంగా చూస్తే మార్కెట్‌లో 2,472 స్టాక్స్ నష్టపోయాయి. వెయ్యి స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్ షేర్లు 4 శాతం నష్టపోతే, రియాల్టి కంపెనీల షేర్లు 2.6 శాతం నష్టపోయి. ఫలితంగా ఇన్వెస్టర్లు ఒక్క రోజులోనే 4.83 లక్షల కోట్లు నష్టపోయారు. స్టాక్‌మార్కెట్ల సంపద 4,90,162.55 కోట్ల నుంచి 276.66 లక్షల కోట్లకు చేరింది. మూడు రోజులుగా మార్కెట్లు నష్టాల్లో ముగిస్తున్నాయి. ఫలితంగా ఈ మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు 6,77,646.74 లక్షల కోట్లు నష్టపోయారు.