ముంబై : దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త కరోనా వేరియెంట్ బోట్స్ వానా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను కుదిపేసింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ గత ఏడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1688 పాయింట్లు లేదా 2.87 శాతం మేర పతనమయ్యి 57,107 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ సూచీ భారీగా 510 పాయింట్లు లేదా 2.9 శాతం మేర క్షీణించి 17,026 పాయింట్ల వద్ద సెషన్ ముగిసింది. ఏప్రిల్ 12 తర్వాత మార్కెట్లు ఇదే అతిపెద్ద నష్టంగా నిలిచింది. సెన్సెక్స్ పై ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ అతిపెద్ద నష్టదార్లుగా నిలిచాయి. మార్కెట్ల భారీ పతనం ఫలితంగా రూ.7.36 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. కాగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ ఫార్మా స్టాక్స్ దూసుకెళ్లాయి. కొత్త వేరియెంట్ ఆందోళనల నేపథ్యంలో ఫార్మా షేర్లు గణనీయ లాభాలతో రాణించాయి.