Tuesday, November 19, 2024

విద్యుత్‌ కార్ల ప్లాన్‌ ప్రకటించిన భావీష్‌ అగర్వాల్‌..

ఓలా ఎలక్ట్రికల్‌ కారును 2024లో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు కీలక ప్రకటన చేస్తామని ఆయన ప్రకటించారు. అనుకున్నట్లుగానే స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఆయన రెండు కీలక ప్రకటనలు చేశారు. ఓలా ఎలక్ట్రికల్‌ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకండ్లలోనే అందుకుంటుందని ఆయన తెలిపారు. ఓలా ఈవీ కారులో అత్యంత ఆధునిక ఫీచర్లు ఉంటాయని, ఇప్పటి వరకు మన దేశంలోఎవరూ చూడని కారును తాము తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నుంచే ఎలక్ట్రికల్‌ కార్లను, టూ వీలర్స్‌ను, బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఈవీ హబ్‌గా నిలుస్తుందన్నారు.

తమిళనాడులోని పోచంపల్లిలో ఓలా కంపెనీ 100 ఎకరాల్లో లిథియం బ్యాటరీ సెల్స్‌ ప్లాంట్‌ను, 200 ఎకరాల్లో విద్యుత్‌ కార్ల ప్లాంట్‌ను, 40 ఎకరాల్లో ఈవీ స్కూటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త ప్లాంట్‌ నుంచి సంవత్సరానికి కోటీ ఈవీ స్కూటర్లను, 10 లక్షల కార్లను ఉత్పత్తి ఈ ఓలా గిగా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనున్నారు. వీటితో పాటు సంవత్సరానికి 100 గిగా వ్యాట్‌ సెల్స్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మన దేశంలో ఇంతవరకు రాని విద్యుత్‌ కారును ఓలా మార్కెట్‌లోకి తీసుకువస్తుందని ఆయన వివరించారు. ఈ కారును పూర్తిగా గ్లాస్‌రూఫ్‌తో తీసుకు వస్తున్నారు. డ్రైవింగ్‌ సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా అత్యంత ఆధునిక 4 డబ్ల్యూ కంప్యూటర్‌ను ఇందులో అమర్చుతున్నారు. కీ లేని, హ్యాండిల్‌ లేని డోర్లు ఉంటాయి. ఓలా తన సొంత ఓఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో కారు యజమానులు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను అందుకుంటారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

భవిష్యత్‌లో మన దేశ కంపెనీలు ఈవీ వాహన మార్కెట్‌లో కనీసం 25 శాతం వాటాను కలిగి ఉంటాయని ఓలా తెలిపింది. ఈవీ వాహనాల విషయంలో మన దేశం మిగిలిన ప్రపంచానికి ఒక నమూనాగా నిలుస్తామని భవీష్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. సెమికండక్టర్లు, సోలార్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో మనం పెట్టుబడులు పెడితే ఎలక్ట్రికల్‌ సెల్స్‌, బ్యాటరీల మార్కెట్‌లో మన దేశం అగ్రస్థానానికి చేరుతుందన్నారు. దేశంలోని 50 ప్రధాన నగరాల్లో 100 హైపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు.

కొత్త ఓలా ఎస్‌ 1 స్కూటర్‌..

ఓలా కొత్తగా ప్రీమియం డిజైన్‌తో ఎస్‌ 1 స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ ప్రారంభ ధర 99.999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఓలా ఎస్‌1 స్కూటర్‌ను 499 రూపాయలతో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.
కొత్త ఓలా ఎస్‌1 స్కూటర్‌ ఒక ఛార్జింగ్‌తో 131 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. 95 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌తో ఈ స్కూటర్‌ ప్రయాణిస్తుంది. ఐదు రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

టెస్లా కంపెనీ విద్యుత్‌ కార్లను వెస్ట్రన్‌ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తోందని భవీష్‌ అగర్వాల్‌ చెప్పారు. మన దేశం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్‌ ఉన్న చిన్నకార్లు, స్కూటర్లు, మోటార్‌బైక్‌ల మార్కెట్‌లో అగ్రభాగాన ఉంటుందన్నారు.
ఓలా గత ఏడు నెలల్లో 70 వేల ఎలక్ట్రానిక్‌ టూ వీలర్లను అమ్మిందని అయన తెలిపారు. ఓలా ఎలక్ట్రికల్‌ ఈ సంవత్సరంలో పబ్లిక్‌ ఆఫర్‌కు రావాలని భావించినప్పటికీ, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితి సరిగాలేనందు వల్ల ఐపీఓ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement